Indian Airforce Base Ladakh: లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపాన చాంగ్‌థాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించే ప్రతిపాదనకు జాతీయ వన్యప్రాణి మండలి (ఎన్‌బీడబ్ల్యూఎల్) స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దీనికి తోడు మరో తొమ్మిది వ్యూహాత్మక ప్రాజెక్టులకు కూడా ఈ మండలి పచ్చజెండా ఊపింది.
చాంగ్‌థాంగ్, కారాకోరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పరిధిలోకి ఇవి వస్తాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో రక్షణపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ చర్యలు తీసుకొంటున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చాంగ్‌థాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి 1,259.25 హెక్టార్ల భూమిని మాహే ఫీల్డ్ ఫైరింగ్ రేంజి రీ నోటిఫికేషనుకు మళ్లించే ప్రతిపాదనకు సైతం స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు ఇది 40 - 50 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ రీ నోటిఫికేషను 2014 నుంచీ పెండింగులో ఉంది. మూడు కీలకమైన రహదారుల విస్తరణ కూడా కమిటీ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఉంది.
సరస్వతి హాన్లే పర్వతం మీద ఉన్న నేత్ర ఆప్టికల్ టెలిస్కోపునకు ఇస్రో లింకురోడ్డు నిర్మాణానికిగాను చాంగ్‌థాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి 1.5 హెక్టార్ల భూమి వినియోగ ప్రతిపాదనకూ ఆమోదం లభించింది. పై రెండు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకూ అనుమతి మంజూరు చేశారు.