వాయుసేనకు గట్టి దెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. రోజువారీ శిక్షణలో భాగంగా గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు... టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. మొరెనా ప్రాంతంలో విమాన శకలాలు పడినట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుఖోయ్‌లో ఇద్దరు, మిరాజ్‌లో ఒక పైలట్ ఉన్నట్లు వాయుసేన ప్రకటించింది. వారిలో ఒక పైలట్ చనిపోగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వాయుసేన ట్విట్ చేసింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పైలట్‌ను కర్ణాటకకు చెందిన వింగ్ కమాండర్ హనుమంత రావు సారథిగా గుర్తించారు.
కుప్పకూలిన రెండు వాయుసేన విమానాలు.. ఓ పైలట్ మృతి.. ఇద్దరు సేఫ్ - మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధ విమానాలు
మధ్యప్రదేశ్‌లో రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. రాజస్థాన్ సరిహద్దు జిల్లా అయిన మొరెనాలో సుఖోయ్ సుఖోయ్-30, మిరాజ్-2000 కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో మిరాజ్ విమాన పైలట్ మరణించినట్లు వాయుసేన ప్రకటించింది.
ప్రమాదానికి గురైన రెండు యుద్ధ విమానాల శకలాలు మొరెనా జిల్లాలోని పహార్‌ఘర్ ప్రాంతంలో పడినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ అస్థానా తెలిపారు. మరికొన్ని శకలాలు మధ్యప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతంలో పడినట్లు చెప్పారు. ఈ ఘటనపై వాయుసేన చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి... కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్... ప్రమాదం అనంతర పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు సంబంధిత శాఖ వర్గాలు తెలిపాయి. యుద్ధ విమానాల ప్రమాద ఘటనలపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాదానికి కారణాలు తెలుస్తాయని పేర్కొంది.