వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా భారత్ మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. అయితే.. ఇతర దేశాల ఒత్తిడితో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులపై చర్యలకు ఆర్థికంగా సహకరించాలని భారత్ ఆశిస్తోందని పేర్కొన్నారు. దిల్లీలోని ఫ్రాన్స్ దౌత్యకార్యాలయం వద్ద ఆ దేశ విదేశాంగ మంత్రి జీన్ డ్రయన్తో భేటీ అయిన తర్వాత జావడేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"పర్యావరణ పరిరక్షణకు.. పారిస్ ఒప్పందంలో పేర్కొన్న అంశాల కన్నా ఎక్కువే చేశాం. జీ-20 దేశాల్లో ఈ ఒప్పందానికి నిబద్ధతతో కట్టుబడి ఉన్న ఏకైక దేశం భారత్. చాలా దేశాలు 2020కి ముందు చేసిన వాగ్దానాలు మరిచిపోయాయి. ఇప్పుడు 2050లో మార్పులు తీసుకురావాలని మాట్లాడుతున్నాయి. బొగ్గును వినియోగించమని అంటున్నాయి. కానీ, దానికన్నా చౌకగా లభించే ప్రత్యామ్నాయంపై సందిగ్ధత నెలకొంది."