Ukraine crisis: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపునకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టట్లేదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత దేశం అంతకంతకూ శక్తిమంతంగా మారుతున్నందునే ఈ ప్రక్రియ సాధ్యమవుతోందని చెప్పారు. సైన్యం ధైర్యాన్ని, 'మేక్ ఇన్ ఇండియా'ను శంకించేవారు భారత్‌ను బలమైన దేశంగా మార్చలేరని ప్రతిపక్షాలనుద్దేశిస్తూ విమర్శించారు. అవినీతిపరులు మళ్లీ బలపడితే.. పేదల సొమ్మును దోచుకుంటారని అన్నారు. మార్చి 7న యూపీలో చివరి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోన్‌భద్ర జిల్లాలో ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ.
"ఉక్రెయిన్ నుంచి భారతీయులను రక్షించడానికి భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఇందుకోసం 'ఆపరేషన్ గంగ'ను ప్రారంభించాం. పర్యవేక్షణ కోసం నలుగురు మంత్రులను పంపాం. సైన్యం, వాయుసేనను రంగంలోకి దించాం. ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టట్లేదు. భారత్ అభివృద్ధి చెందుతున్నందునే ఇది సాధ్యమవుతోంది. కుటుంబ పాలకులు దేశంలో కరోనా టీకాను, సైన్యం సాహసాలను, మేక్ ఇన్ ఇండియాను పరిహాసం చేశారు. ఇలాంటివారు బలమైన దేశాన్ని తయారు చేయలేరు.'
-ప్రధాని నరేంద్ర మోదీ