సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించే నెపంతో చైనా కొత్త కుయుక్తులు పన్నుతోంది. ఈ నేపథ్యంలోనే బలగాల ఉపసంహరణకు మూడంచెల ప్రణాళికలను ప్రతిపాదించింది. ఇరుదేశాల మధ్య చుషుల్ సెక్టార్‌లో నవంబర్ 6న జరిగిన.. ఎనిమిదవ రౌండ్ చర్చల్లో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలతో భారత్‌కే ఎక్కువ నష్టం జరగనుంది. అయితే, భారత్ వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
మొదటి దశ
మొదటి దశలో భాగంగా.. ఒక్క రోజులోనే కీలక స్థానాల్లో మోహరించిన బలగాలను, ట్యాంకులను వెనక్కి రప్పించాల్సి ఉంటుంది. వీటిలో సరిహద్దులో కీలకంగా ఉన్న గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతం, స్పాంగుర్ గ్యాప్ వంటి ప్రాంతాలున్నాయి. ఈ ప్రదేశాల్లో భారత్ బలగాలు టీ-72, టీ-90 ట్యాంకులు ఉన్నాయి. అలాగే, బీఎంపీ పదాతిదళాలు మోహరించాయి. చైనావైపు టైప్-15 ట్యాంకులు, డొంగ్‌ఫెంగ్ వాహనాలు సిద్ధంగా ఉంచారు.
చైనా ప్రతిపాదన ప్రకారం భారత్ బలగాలను గల్వాన్ లోయ నుంచి వెనక్కి పిలిపిస్తే.. అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. ఎందుకంటే చైనా అక్కడ ఎటువంటి చర్యలకు పాల్పడ్డా భారత బలగాలను తిరిగి మోహరించటం ఇబ్బందిగా మారుతుంది. అదే చైనావైపు వాహనాల రాకపోకలకు మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. జూన్ 15 ఘర్షణల తర్వాత గల్వాన్ లోయలో ఇప్పటికీ పరిస్థితులు గంభీరంగానే ఉన్నాయి.
మరోవైపు పాంగాంగ్ సరస్సు దక్షణ ప్రాంతం, స్పాంగుర్ గ్యాప్‌లలో... చైనాపై భారత్ పైచేయి సాధించింది. కీలక పర్వతాలు స్వాధీనం చేసుకుని పట్టు సాధించింది. చైనా తిరిగి ఈ ప్రాంతంపై పట్టు సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు భారీగా మోహరించిన యుద్ధ సామగ్రిని ఒక్క రోజులో వెనక్కి తీసుకురావటం అంత సులభం కాదు.
రెండవ దశ
ఇక ప్రతిపాదనలో భాగంగా రెండొవ దశలో.. పాంగాంగ్ సరస్సు ఉత్తర భాగంలో ఏకకాలంలో ఇరుదేశాలు రోజుకు 30శాతం చొప్పును 3రోజుల పాటు బలగాలను వెనక్కి రప్పించాలని ప్రతిపాదించింది చైనా. ఈ ప్రతిపాదన ప్రకారం భారత్ బలగాలు ఫింగర్ 3,4 పర్వతాల వద్దనున్న ధన్‌సింగ్ థాపా పోస్ట్ వద్దకు చేరుకుంటాయి. అదే సమయంలో చైనా బలగాలు ఫింగర్ 8 పర్వతం వెనక్కి వెళ్లాలి.