Rajnath Singh On Pakistan: పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ భారత్‌లో భాగమని.. భవిష్యత్తులో కూడా అది అలాగే కొనసాగుతుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. జమ్మూలో కార్గిల్ విజయ దివస్ వేడుకల్లో పాల్గొన్న రాజ్‌నాథ్.. పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు పంపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని నొక్కి చెప్పిన రక్షణమంత్రి.. బాబా అమర్‌నాథ్ మన దగ్గర ఉంటే.. శారద శక్తి పీఠం సరిహద్దు ఆవల ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పీఓకే భారత్‌లో భాగమని పార్లమెంట్‌లో తీర్మానం చేసిన విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తు చేశారు.
భారత్‌కు హాని తలపెట్టాలని భావించిన వారికి తగిన గుణపాఠం చెప్తామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏ యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందన్న రక్షణమంత్రి.. ఏ యుద్ధంలో అయినా భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ జరిగిన అన్ని యుద్ధాల్లో పాక్‌ను భారత్ ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. మనల్ని నేరుగా ఎదుర్కోలేక పాక్ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వాటిని కూడా మన సైనికులు సమర్థంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. పాక్ ఎన్ని కుట్రలు పన్నినా భారత ఐక్యత, సమగ్రత సార్వభౌమత్వానికి భంగం కలిగించలేదని స్పష్టం చేశారు. అయినా భారత శక్తి ఏమిటో పాకిస్థాన్‌కు బాగా తెలుసన్నారు. 1962తో పోలిస్తే ప్రస్తుత భారత్.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు.