ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Kheri News) చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లాలో 144వ సెక్షన్‌ను విధించారు. అంతర్జాల సేవలనూ నిలిపివేశారు. ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.
ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి కుమారుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రను పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ఘటనను నిరసిస్తూ పలు ప్రతిపక్ష పార్టీల నేతలు భాజపాపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్ష నేతలు రాజకీయ పర్యటనలు చేస్తున్నారని యోగి సర్కారు ఆరోపించింది.
ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో, ఆదివారం లఖింపుర్ ఖేరీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు(Farmers Protest News) కోరుతూ అక్కడి తికోనియా-బన్బీర్‌పుర్ రహదారిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు మృతిచెందారు.
రైతులతో అధికారుల చర్చలు
లఖింపుర్ ఖేరి ఉద్రిక్తంగా మారడంతో... ఉత్తర్‌ప్రదేశ్ అధికారులు రైతులతో(Farmers Protest News) చర్చలు జరిపారు. మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ అవస్థి వెల్లడించారు. గాయపడ్డవారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కేంద్ర మంత్రి కుమారుడు సహా పలువురిపై మొత్తం రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వివరించారు. ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కాగా, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని లఖింపుర్ ఖేరిలో 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని, రైతు సంఘాల నేతలను మాత్రం అడ్డుకోబోమన్నారు.
అన్ని దారులు మూసివేత...
బయటివారు లఖింపుర్ ఖేరికి రాకుండా జిల్లా సరిహద్దుల్లో అన్ని రహదారులను మూసివేశారు. అక్కడ పోలీసులను భారీగా మోహరించారు. అక్కడి శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను మోహరిస్తోంది.
మంత్రిని తొలగించాలి: రైతు సంఘాల డిమాండ్
అజయ్ మిశ్రను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసింది. ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించింది. మరోవైపు- లఖింపుర్ ఖేరి ఘటనకు నిరసనగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా... అన్ని రాష్ట్రాల జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టినట్టు వెల్లడించింది. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ సోమవారం ఉదయాన్నే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రిని పదవి నుంచి తొలగించాలన్నారు. డిమాండ్లు నెరవేర్చేవరకూ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించబోమని హెచ్చరించారు. భాజపా కార్యకర్తలెవరూ ఉత్తర్‌ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించవద్దని మరో నేత నరేశ్ టికాయిత్ హెచ్చరించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ తాను, తన కుమారుడు లేమని మంత్రి చెప్పడాన్ని కొందరు రైతులు ఖండించారు. మంత్రి కుమారుడు ఆశిష్ స్వయంగా తుపాకీతో బెదిరించినట్టు ఆరోపించారు.
ఈ దేశం రైతులది... భాజపాది కాదు: ప్రియాంక
లఖ్‌నవూ నుంచి లఖింపుర్ ఖేరికి బయల్దేరిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని... సితాపుర్ వద్ద పోలీసులు అరెస్టు చేసి, సమీపంలోని ఓ అతిథి గృహానికి తరలించారు. ఘటనకు నిరసనగా ఆమె అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు. చీపురు పట్టి, తనను ఉంచిన గదిని శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అంతకుముందు ప్రియాంక మరో వీడియోలో మాట్లాడారు. "ఈ దేశం రైతులది. భాజపాది కాదు. దగాపడ్డ రైతు కుటుంబాల బాధను పంచుకోవడానికి వెళ్తున్నా" అని వ్యాఖ్యానించారు. ప్రియాంకతో పాటు ఆమె వెంట ఉన్న మరికొందరిపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.