తెలంగాణ

telangana

ETV Bharat / bharat

INDIA vs NDA Bypoll 2023 : ఇండియా కూటమికి తొలి పరీక్ష.. ఉప ఎన్నికల్లో ఎన్​డీఏతో ఢీ.. బంగాల్​లో మాత్రం.. - ఇండియా కూటమి బైపోల్

INDIA vs NDA Bypoll 2023 : విపక్ష కూటమి 'ఇండియా' తొలి పరీక్షకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా మంగళవారం వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏను ఢీకొట్టబోతోంది. ఈ ఎన్నికలు విపక్ష కూటమి సత్తాకు పరీక్షగా నిలవనుండగా.. బంగాల్​లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

INDIA vs NDA Bypoll 2023
INDIA vs NDA Bypoll 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 7:08 PM IST

INDIA vs NDA Bypoll 2023 : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏను గద్దెదించాలన్న లక్ష్యంతో జట్టుకట్టిన ఇండియా కూటమి కీలక పరీక్ష ఎదుర్కోనుంది. మంగళవారం జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థులతో అమీతుమీ తేల్చుకోనుంది. అసెంబ్లీ ఎన్నికలే అయినప్పటికీ.. పలు స్థానాల్లో ఎన్​డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు ఒకే అభ్యర్థిని నిలబెట్టడమో, లేదా పోటీకి దూరంగా ఉండటమో చేశాయి. మొత్తం ఏడు స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం చూపకపోయినప్పటికీ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇండియా X ఎన్​డీఏ.. బీఎస్​పీ దూరం
INDIA vs NDA UP by Election :ఉప ఎన్నిక జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​ మౌ జిల్లాలోని ఘోసీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ తరఫున ధారాసింగ్ చౌహాన్ బరిలో నిలిచారు. సమాజ్​వాదీ పార్టీ(ఎస్​పీ)కి వీడ్కోలు చెప్పి బీజేపీలో చేరిన ఆయన.. శాసనసభకు సైతం రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ధారాసింగ్​కు వ్యతిరేకంగా ఎస్​పీ నుంచి సుధాకర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్, సీపీఎం, సీపీఐ, ఆర్​ఎల్​డీ సుధాకర్​కు మద్దతు ప్రకటించాయి. మొత్తంగా ఈ స్థానం నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. పోటీ ప్రధానంగా బీజేపీ, ఎస్​పీ మధ్యే ఉండనుంది. రాష్ట్రంలోని మరో ప్రధాన పార్టీ అయిన బీఎస్​పీ.. పోటీకి దూరంగా ఉంది. లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కారణంగానే ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఎస్​పీ వర్గాలు చెబుతున్నాయి.

ఘోసీలో అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా..

'ఇండియాకు తొలి విజయం ఇక్కడే'
ఝార్ఖండ్​లోని డుమ్రి నియోజకవర్గంలోనూ ఇండియా, ఎన్​డీఏ కూటముల మధ్య పోటీ నెలకొంది. మాజీ విద్యాశాఖ మంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే జగర్నాథ్ మహతో మరణంతో ఈ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. జేఎంఎం తరఫున జగర్నాథ్ భార్య బేబీ దేవి బరిలో ఉండగా.. ఎన్​డీఏ తరఫున యశోద దేవి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తొలి విజయం ఇక్కడే నమోదవుతుందని జేఎంఎం అధినేత, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానానికి ఆరుగురు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం సైతం తన అభ్యర్థిని బరిలోకి దించింది.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఉత్తరాఖండ్​లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సైతం ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ ఈ ఏడాది ఏప్రిల్​లో కన్నుమూసిన నేపథ్యంలో ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. 2007 నుంచి చందన్ రామ్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా నాలుగు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆయన భార్య పార్వతి దాస్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున బసంత్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ రెండు పార్టీలు కాకుండా.. సమాజ్​వాదీ, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్, ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి.

చాందీ కంచుకోటకు ఎన్నిక..
కేరళ కాంగ్రెస్ దిగ్గజం ఊమెన్ చాందీ మరణంతో ఖాళీ అయిన పూతుపల్లి నియోజకవర్గానికి సైతం ఉప ఎన్నిక జరగనుంది. ప్రధానంగా ఎల్​డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ ఉండనుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తరఫున చాందీ తనయుడు చాందీ ఊమెన్ బరిలో ఉన్నారు. లెఫ్ట్ కూటమి తరఫున థామస్ జైక్ సీ ఆయన్ను ఢీకొడుతున్నారు. అటు, బీజేపీ సైతం మోదీ ఇమేజ్​ను, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అజెండాను ఆసరా చేసుకొని ఎన్నికల బరిలో దిగింది. కొట్టాయం జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీ లిజిన్​లాల్​ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. 53 ఏళ్లుగా ఈ స్థానానికి ఊమెన్ చాందీ నేతృత్వం వహించగా.. ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లు ఏ తీర్పు ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

త్రిపురలో రెండు చోట్ల..
త్రిపురలోని ధన్​పుర్, బోక్సానగర్​ అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉండే బోక్సానగర్​లో బీజేపీ తరఫున తఫజ్జల్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. సీపీఎం తరఫున మిజాన్ హుస్సేన్ బరిలో ఉన్నారు. ధన్​పుర్​లో బీజేపీ తరఫున బిందు దేబ్​నాథ్, సీపీఎం తరఫున కౌశిక్ దేబ్​నాథ్ బరిలో ఉన్నారు. త్రిప్రా మోథా, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి.

'ఇండియా కూటమితో సంబంధం లేదు'
ఇదిలా ఉంటే.. బంగాల్ ఉప ఎన్నిక ఇండియా కూటమి ఐక్యతకు సవాల్​గా నిలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన ధుప్​గుడి అసెంబ్లీ స్థానానికి కమలం పార్టీ, అధికార టీఎంసీతో పాటు కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి సైతం పోటీ పడుతోంది. కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన అధీర్ రంజన్ చౌదరి.. బీజేపీతో పాటు మమత సర్కారుపై పదునైన విమర్శలు గుప్పించారు. ఇది స్థానిక ఎన్నిక మాత్రమేనని.. ఇండియా కూటమికి దీనితో సంబంధం లేదని అధీర్ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో ఐక్యత లోపించిందని బీజేపీ ఆరోపించగా.. కమలం పార్టీకి మేలు చేసేందుకే కాంగ్రెస్-లెఫ్ట్ పోటీ చేస్తున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది.

Stalin On Sanatana Dharma BJP : స్టాలిన్​పై బీజేపీ ఫైర్.. క్షమాపణకు రాజ్​నాథ్ డిమాండ్.. తమ సిద్ధాంతం అదేనన్న కాంగ్రెస్!

Prashant Kishor on One Nation One Election : ''ఒకే దేశం- ఒకే ఎన్నిక'తో జరిగేది అదే'.. ఐప్యాక్ ప్రశాంత్ కిశోర్ విశ్లేషణ ఇదీ..

ABOUT THE AUTHOR

...view details