తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వ్యాక్సిన్ల దిగుమతిపై కేంద్రం వెనక్కి! - దేశంలో టీకాలకు అనుమతులు

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఫైజర్‌(Pfizer Vaccine India, మోడెర్నా టీకాలు(Moderna Vaccine India) భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి వీటిని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి గణనీయంగా పెరగడం సహా తక్కువ ఖర్చులోనే లభ్యమవుతుండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తున్న భారత్‌లో ఈ రెండు టీకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే అవకాశం తక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

moderna and pfizer vaccines in india
దేశంలో మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు

By

Published : Sep 23, 2021, 5:11 AM IST

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌(Pfizer Vaccine India), మోడెర్నా(Moderna Vaccine India) సంస్థలు తయారు చేసిన టీకాలు 90శాతానికిపైగా సమర్థతతో పనిచేస్తున్నాయని ఇప్పటికే వెల్లడైంది. భారత్‌లో అత్యవసర వినియోగం కింద మోడెర్నా(Moderna Vaccine India) ఇప్పటికే అనుమతి పొందగా.. ఫైజర్‌కు(Pfizer Vaccine India) మాత్రం అనుమతి కోసం మరోసారి దరఖాస్తు చేసుకోలేదు. అయితే, మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ.. ప్రైవేటు సంస్థలకు విక్రయించబోమని ఆ సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. కేవలం ప్రభుత్వ మార్గాల ద్వారానే ఆయా దేశాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి. కానీ, భారత ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఆ రెండు వ్యాక్సిన్లను సేకరించేందుకు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ల ధర, నిర్వహణ సమస్యలతోనే ప్రభుత్వం వాటికి దూరంగా ఉండనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ధర కూడా భారమే..!

భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన తొలినాళ్లలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. అప్పట్లో ఆయా సంస్థలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో ఫైజర్‌, మోడెర్నా వంటి టీకాల ధర ఎక్కువ కావడంతో పాటు ఆయా సంస్థలు కొన్ని నిబంధనలు పెడుతున్నాయి. అలాంటప్పుడు వారి డిమాండ్లను మనమెందుకు తలొగ్గాలి అని భారత్‌లో వ్యాక్సిన్‌ వ్యవహారాలను చూస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఫైజర్‌(Pfizer Vaccine India), మోడెర్నా(Moderna Vaccine India) నుంచి ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ డోసులను సేకరించే అవకాశం లేదని మరో అధికారి పేర్కొన్నారు. ఏవైనా దుష్ర్పభావాలు ఎదురైతే న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలకు బాధ్యత వహించే ఇండెమ్నిటీ విషయంలోనూ ఇప్పటివరకు ఏ సంస్థకీ భరోసా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఫైజర్‌ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అయితే, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఫైజర్‌(Pfizer Vaccine India) ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఇక మోడెర్నాకు(Moderna Vaccine India) ఇప్పటికే అనుమతి లభించినప్పటికీ వ్యాక్సిన్‌ నిల్వకు తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం కావడం ఓ సవాలుగా మారినట్లు తెలుస్తోంది. దీంతో సరఫరా, పంపిణీలోనూ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొవిషీల్డ్‌తో పోలిస్తే వీటి ధర కూడా ఎక్కువగా ఉండడంతో వీటి సేకరణకు కేంద్రప్రభుత్వం సుముఖత చూపకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రైవేటులో మాత్రం లభ్యమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికాకు చెందిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే&జే) అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌లో జే&జే వ్యాక్సిన్‌ సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి స్థానిక సంస్థ బయోలాజికల్‌ ఇతో జే&జే ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.

గణనీయంగా పెరిగిన ఉత్పత్తి..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ(Vaccination Status In India)ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 80కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఇదే సమయంలో దేశీయంగా వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఒక్క అక్టోబర్‌లోనే దాదాపు 30కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు 22కోట్ల డోసులను కేవలం సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచే అందుబాటులో ఉండనున్నాయి. ఇక భారత్‌ బయోటెక్‌ కూడా అక్టోబర్‌లో దాదాపు 5కోట్ల డోసులను అందిస్తామని పేర్కొంది. వీటితో పాటు స్పుత్నిక్‌-వీ కూడా దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలోనే మిగులు టీకాలను విదేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఫైజర్‌, మోడెర్నా టీకాలను భారత ప్రభుత్వం ప్రస్తుతానికి కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:'ప్రపంచ దేశాలకు 50కోట్ల టీకాలు అందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details