రాబోయే రోజుల్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని, పాక్ కవ్వింపు చర్యలకు భారత్ మరింత బలంగా స్పందించే అవకాశముందని అమెరికా నిఘా సంస్థ అంచనా వేసింది. ఈ రెండు దేశాల మధ్య విభేదాలు యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
అమెరికా నిఘా సంస్థ ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్(ఓడీఎన్‌ఐ).. ప్రపంచ దేశాల ముప్పు అంచనా వార్షిక నివేదికను తాజాగా యూఎస్ కాంగ్రెస్‌కు సమర్పించింది. ఇందులో భారత్-పాక్, భారత్-చైనా ఉద్రిక్తతలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
"భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేనప్పటికీ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కశ్మీర్‌లో కల్లోలం లేదా భారత్‌లో ఉగ్రదాడులతో ఈ రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణల ముప్పు పొంచి ఉంది. పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ గతంలో కంటే ఎక్కువ సైనిక శక్తితో స్పందించే అవకాశముంది"
-ఓడీఎన్‌ఐ నివేదిక
2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని పునర్విభజన చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన పాక్.. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను తప్పుబట్టేందుకు ప్రయత్నించి భంగపాటుకు గురైంది. పాకిస్థాన్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు తాము కృతనిశ్చయంతోనే ఉన్నామని, అయితే ఉగ్రవాదరహిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పొరుగుదేశంపైనే ఉందని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది.
ఉద్రిక్తంగానే భారత్-చైనా సంబంధాలు
ఈ సందర్భంగా భారత్-చైనా సరిహద్దు వివాదం అంశాన్ని కూడా అమెరికా నిఘా సంస్థ ప్రస్తావించింది. "2020 మే నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇవి.. ఇరు దేశాల జవాన్ల మధ్య ప్రత్యక్ష ఘర్షణలకూ దారితీశాయి. అయితే పలుమార్లు దౌత్య, సైనికపరమైన చర్చల తర్వాత సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే బలగాల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు ఇంకా తీవ్రంగానే ఉన్నాయి. డ్రాగన్ తమ ప్రభుత్వ సాధనాలతో తన బలాన్ని ప్రదర్శిస్తూ పొరుగుదేశాలపై బలవంతపు చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోంది. వివాదాస్పద భూభాగాలపై తమ ఆరోపణలను అంగీకరించాలని ఇతర దేశాలను బలవంతపెడుతోంది" అని యూఎస్ నివేదిక ఆరోపించింది.
ఇదీ చూడండి:'పాక్‌తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నాం'
ఇదీ చూడండి:'సరిహద్దు పరిస్థితులను చూసి భారత్ సంతోషించాలి'