ఇస్లామిక్ ఉగ్రవాదానికి అఫ్గానిస్థాన్ కేంద్రబిందువుగా మారే ప్రమాదం ఉన్నట్టు భారత్ భావిస్తోంది. ఈ విషయాన్ని అఫ్గాన్ వ్యవహారాలతో సంబంధం ఉన్న కొందరు అధికారులు మీడియాకు వెల్లడించారు. అమెరికా విడిచిపెట్టి వెళ్లిన ఆయుధాలతో పాటు అప్పటివరకు అఫ్గాన్ సైనికుల వద్ద ఉన్న తుపాకులతో ఇప్పుడు తాలిబన్లు మరింత శక్తిమంతంగా మారే అవకాశముందని భారత్ అభిప్రాయపడుతోందన్నారు.
"లష్కరే తోయిబా, లష్కరే ఝాంగ్వి వంటి పాక్ ఆధారిత ఉగ్ర సంస్థల ఉనికి అఫ్గానిస్థాన్‌లోనూ ఉంది. కాబుల్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇతర గ్రామాల్లో చెక్‌పోస్టులను ఈ ఉగ్రసంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా అఫ్గానిస్థాన్ మారే అవకాశం ఉంది. అమెరికా ఆయుధాలతో పాటు 3లక్షలకుపైగా అఫ్గాన్ సైనికుల ఆయుధాలు వారి చేతికి చిక్కాయి. ఇది భద్రతాపరంగా ఆందోళనకర విషయం."
-- భారత అధికారులు.
తాలిబన్ల ప్రవర్తన, ప్రభుత్వం ఏర్పాటు, అందులోని సభ్యుల తీరు ఏ విధంగా ఉంటుందనే అంశాలను భారత్ నిశితంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది కూడా కీలకమేనన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:-భారత్ కానుక తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!
ప్రజాస్వామ్య పాలనను ముగింపు పలుకుతూ..మెరుపు వేగంతో అఫ్గాన్‌ను ఆక్రమించుకుని తమ జెండాను ఎగరవేశారు తాలిబన్లు. ఈ క్రమంలో ఆ దేశంలో భయాందోళనలు తారస్థాయికి చేరాయి. ప్రజలు బిక్కుబిక్కమంటూ జీవిస్తుంటే.. మరికొందరు దేశాన్ని విడిచివెళ్లాలని విమానాశ్రయాలకు పరుగులు తీస్తున్నారు. ఈ దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.