అంతర్జాతీయ విమాన సర్వీసులపై (International flights from india) కేంద్రం కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ సేవలను పునరుద్ధరిస్తామని(Normal International flights resume) తెలిపింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ ప్రకటన జారీ చేసింది. నిషేధించిన 14 దేశాలకు మినహా... మిగతా దేశాలకు యథాతథంగా విమాన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసిన కేంద్రం.. ఇప్పటికే ఆ దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం విమానాలు నడుస్తున్నట్లు పేర్కొంది.
"అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించే విషయంపై కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపాం. అంతర్జాతీయ విమాన సేవలను డిసెంబర్ 15, 2021 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం."
- పౌర విమానయాన శాఖ
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులు గతేడాది మార్చిలో రద్దయ్యాయి. విదేశీ ప్రయాణాలను పునఃప్రారంభించే లక్ష్యంతో కేంద్రం సుమారు 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. కొన్ని నిబంధనలు పాటించి.. ఇరుదేశాల విమానయాన సంస్థలు సర్వీసులను నడపాల్సి ఉంటుంది.
ప్రయాణికుల్లో సందిగ్ధం..
దక్షిణాఫ్రికాలో కొవిడ్ కొత్త వేరియంట్(Covid new variant) వెలుగు చూసిన నేపథ్యంలో ఆ దేశానికి విమాన సేవలను భారత్ కొనసాగిస్తుందా? అనే దానిపై ప్రయాణికుల్లో సందిగ్ధత ఏర్పడింది. కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
ఇదీ చూడండి:హైకోర్టు మాజీ జడ్జిపై అవినీతి ఆరోపణలు- సీబీఐ విచారణకు కేంద్రం ఓకే