కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు అందించి(vaccine maitri) అండగా నిలిచింది భారత్. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు(vaccine maitri) అందించి, సాయపడాలని భావిస్తోంది.
భారత్లో అదనంగా ఉన్న కొవిడ్ టీకాలను 'వ్యాక్సిన్ మైత్రి'(vaccine maitri) కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలిపారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. అయితే.. దేశ పౌరులకు వ్యాక్సిన్(india vaccine news) వేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.
"అక్టోబర్లో 30 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులను కేంద్రం సేకరించనుంది. రాబోయే మూడు నెలల్లో ఈ సంఖ్య 100 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే దేశంలో 81 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు. గత 11 రోజుల్లోనే 10 కోట్ల డోసులు అందజేశాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య విదేశాలకు 'వ్యాక్సిన్ మైత్రి' కార్యక్రమంలో భాగంగా.. విదేశాలకు టీకా ఎగుమతి చేస్తాం. దీనిద్వారా కొవాక్స్ కార్యక్రమానికి అండగా నిలుస్తాం. ఇదే మా వసుధైక కుటుంబం నినాదానికి నిదర్శనం."
- మన్సుఖ్ మాండవీయా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.