కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా గత కొద్దినెలలుగా చేస్తున్న పోరులో భారత్ కీలక ఘట్టానికి చేరువైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో దేశం 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని చేరుకోనుంది. ఇదే జరిగితే చైనా తర్వాత 100 కోట్ల డోసులు అందించిన దేశంగా భారత్ కీర్తి గడించనుంది. 2021 జనవరి 16న ప్రారంభమైన ఈ మహోద్యమంలో ఎన్నో అడ్డంకులూ అవాంతరాలూ ఎదురైనా ఈ ప్రగతిలో దేశ ప్రజలందరి భాగస్వామ్యం కాదనలేనిది. మరి ఈ శతకోటి ప్రయాణంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? అందుకున్న మైలురాళ్లేమిటి? చేరాల్సిన లక్ష్యానికి ఇంకెంత దూరంలో ఉన్నాం? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం పదండి..
ఆరంభంలో ఒడుదొడుకులు..
కొవిడ్ మహమ్మారిని అరికట్టడానికి దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు, ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయడం ప్రారంభమైంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్ వేయడం మొదలు పెట్టారు. ఈ తొలి అడుగుల్లోనే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై విపక్షాల విమర్శలు, ప్రభుత్వం తిప్పికొట్టడంతోనే కొంత కాలం సరిపోయింది. అక్కడికి కొద్దిరోజులకే దేశాన్ని రెండో వేవ్ కుదిపేసింది. ఎప్పుడూలేని విధంగా 4 లక్షల కేసులు వెలుగుచూడడం, ఆక్సిజన్ కొరత వేధించింది. మరికొద్దిరోజులకు వ్యాక్సిన్లను రాష్ట్రాలే సమకూర్చుకోవాలని కేంద్రం చెప్పడం.. కేంద్రమే చేపట్టాలని రాష్ట్రాలు లేఖలు రాయడం.. మళ్లీ కేంద్రమే సార్వత్రిక టీకా కార్యక్రమానికి పూనుకోవడంతో మరికొంతకాలం గడిచిపోయింది. అలా జూన్ 21 నుంచి అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కొవిడ్‌పై పోరులో కీలక సమయం అక్కడే వృథా అయ్యిందనేది కాదనలేని సత్యం. ఇందులో కొవిడ్ రెండో వేవ్ పాత్ర కొంతైతే.. పాలకుల తప్పిదాలు మరికొంత. జూన్ తర్వాతే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది.
ప్రస్తుతం ఇలా..
జూన్ నెలాఖరుకు రోజుకు 40 లక్షల డోసులు వేసే స్థాయి నుంచి గరిష్ఠంగా 2.18 కోట్ల డోసులు (సెప్టెంబర్ 17) వేసే స్థాయికి భారత్ చేరుకుంది. ప్రస్తుతం సగటున 80 లక్షల డోసులు వేస్తున్నారు. అలా అక్టోబర్ 18 నాటికి 98,19,11,523 డోసుల పంపిణీ పూర్తయ్యింది. ఇందులో 69,78,47,487 మందికి తొలి డోసు... 28,40,64,036 మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేశారు. ఈ లెక్కన ఒకటి రెండ్రోజుల్లో 100 కోట్ల మైలురాయిని భారత్ అందుకోనుందన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తో్ది. ఇప్పటికీ వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నవారిని సైతం ఈ క్రతువులో భాగస్వామ్యం చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా రూపొందిన వీడియోలను విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశంలో కొవిడ్ కొత్త కేసులు సైతం తగ్గుముఖం పట్టిన వేళ ఈ వేడుక జరుపుకోవడం సంతోషకరమైన విషయం.