కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే రెండో విడతలో కరోనా విజృంభిస్తూ ప్రజలకు తీవ్ర ఆవేదనను, అంతులేని విషాదాన్ని కలిగిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. ప్రస్తుత కష్టకాలంలో ప్రజలందరూ ఒకరికిమరొకరు పరస్పరం సహాయం చేసుకుంటూ అండగా నిలవాలని, సమష్ఠిగా ఈ గండాన్ని గట్టెక్కాలని సూచించారు. 'మనం అధిగమించగలం' అనే శీర్షికతో మంగళవారం ఆమె ఫేస్‌బుక్‌లో భావోద్వేగమైన సందేశాన్ని పోస్టు చేశారు.
"నిరాశపూరితమైన ప్రస్తుత పరిస్థితుల్లో శక్తినంతటినీ కూడగట్టుకొని మనం చేయగలిగినంత సహాయాన్ని ఇతురులకు చేద్దాం. అవిశ్రాంత కృషి, దృఢ సంకల్పంతో ఈ సంక్షోభాన్ని అధికగమించగలం"
-- ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
కరోనా సృష్టిస్తున్న మృత్యు విలయం తననెంతో ఆవేదనకు గురిచేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఎందరో తమ ఆత్మీయులను, కుటుంబ సభ్యులను కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. దేశం తలదించుకొనే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న వారే కారణమని విమర్శించారు. విపత్తులు ఎదురైన ప్రతిసారీ దేశ ప్రజలందరూ కలిసికట్టుగా దానిని ఎదుర్కొన్నారని గుర్తు చేస్తూ మరోసారి అటువంటి ధైర్యాన్ని, మానవతావాదాన్ని ప్రతిఒక్కరూ చాటుకోవాలని కోరారు.
యూపీ ముఖ్యమంత్రికి ఘాటుగా లేఖ
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజల ఇబ్బందులపై ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తీవ్ర పదజాలంతో లేఖ రాశారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు తగు సంఖ్యలో చేయడంలేదని, ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధిక సంఖ్యలో వైరస్ బారినపడి మృతిచెందుతున్నా స్పందించని ముఖ్యమంత్రిని రాబోయే తరాలు క్షమించబోవంటూ ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రియాంకా గాంధీ పది సూచనలను చేశారు.
ఇదీ చదవండి :'18 ప్లస్'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే