PM Modi Gujarat KKP Hospital: దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంతో రాబోయే పదేళ్లలో భారత్.. రికార్డు సంఖ్యలో వైద్యులను కలిగి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని భుజ్‌లో 200 పడకల కేకే పటేల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని దిల్లీ నుంచి వర్చువల్‌గా ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. భూకంప ప్రభావాన్ని ఎదుర్కొన్న భుజ్.. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో కొత్త చరిత్రను లిఖిస్తోందని మోదీ తెలిపారు.
"రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో సుమారు 1,100 ఎంబీబీఎస్ సీట్లతో తొమ్మిది వైద్య కళాశాలలు ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఎయిమ్స్‌తో పాటు 36 వైద్య కళాశాలలు ఉన్నాయి. గతంలో గుజరాత్‌లోని మెడికల్ కాలేజీల్లో 1,000 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందేవారు. ప్రస్తుతం ఈ కాలేజీల్లో దాదాపు 6,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాజ్‌కోట్‌లో ఉన్న ఎయిమ్స్ కళాశాలలో 2021 నుంచి 50 మంది విద్యార్థులను చేర్చుకుంటున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని, ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని మోదీ సూచించారు. యోగా, ఆయుర్వేదానికి భారతదేశంలోనే మూలాలు ఉన్నాయని తెలిపారు. మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా యోగా, ఆయుర్వేదం వైపే మొగ్గు చూపారని, ప్రజలంతా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భారత్ నుంచి పసుపు ఎగుమతి పెరిగిందని ఆయన అన్నారు.