మరికొన్నినెలల పాటు వ్యాక్సిన్ ఎగుమతులను విస్తరించబోమని కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.
ఇప్పటివరకు భారత్ దాదాపు 80 దేశాలకు 6.4 కోట్ల టీకా డోసులను సరఫరా చేసింది. ఇందులో కొన్ని దేశాలకు సాయంగా, మరికొన్నింటికి వాణిజ్య పరంగా అందించింది. కొవిడ్ టీకా పంపిణీలో సమానత్వం కోసం ఏర్పాటైన కొవాక్స్లో భాగంగానూ మనదేశం.. వ్యాక్సిన్లను ఆయా దేశాలకు పంపించింది.
2-3 నెలల్లో..
అయితే.. ఆయా దేశాలకు టీకా అందించేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని, కానీ దేశీయ డిమాండ్‌ను నెరవేర్చేందుకు రానున్న కొన్నినెలలు ఎగుమతులను విస్తరించబోమని అధికారులు పేర్కొన్నారు. 2-3 నెలల తర్వాత పరిస్థితి సమీక్షించనున్నట్లు వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.