తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో పులుల సంఖ్య 3,167'.. టైగర్​ రిజర్వ్​లో మోదీ - దేశంలో పులుల సంఖ్య

కర్ణాటకలోని బండీపుర టైగర్ రిజర్వ్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. "ప్రాజెక్ట్ టైగర్" ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. దేశంలో 2022 నాటికి 3,167 పులులు ఉన్నట్లు వెల్లడించారు.

PM Modi Visits Bandipur Tiger Reserve In Karnataka
PM Modi Visits Bandipur Tiger Reserve In Karnataka

By

Published : Apr 9, 2023, 2:11 PM IST

Updated : Apr 9, 2023, 2:28 PM IST

దేశంలో 2022 నాటికి 3,167 పులులు ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వ్‌ను మోదీ సందర్శించారు. అనంతరం రాచనగరిలోని కర్ణాటక సార్వత్రిక విశ్వ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పులుల బండీపుర అభయారణ్యం- టైగర్‌ ప్రాజెక్టు సువర్ణ మహోత్సవాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రాజెక్ట్‌ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలోనే 'ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్'ను కూడా ప్రారంభించారు. ఇది పులి, సింహం సహా ప్రపంచంలోని 7 పెద్ద పెద్ద జంతువుల రక్షణపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2006లో 1,411గా ఉండగా.. 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967కు చేరింది.

"ప్రాజెక్టు టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రాజెక్టు టైగర్‌ విజయవంతం భారత్‌లోనే కాకుండా మెుత్తం ప్రపంచ గౌరవానికి సంబంధించిన విషయం. భారత్‌లో పులులను రక్షించడమే కాకుండా అభివృద్ధి చెందడానికి అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను కూడా అందించింది. ఈ సమయంలో ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 75 శాతం పులులు భారత్‌లో ఉన్నాయి. భారత్‌లో టైగర్‌ రిజర్వ్‌ విస్తీర్ణం 75 వేల చదరపు కిలోమీటర్లు ఉంది. గత 10, 12 ఏళ్లలో దేశంలో పులుల సంఖ్య 75 శాతం పెరిగింది."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అంతకుముందు.. బండీపుర టైగర్ రిజర్వ్​ను సందర్శించిన తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఈ సందర్భంగా పులుల అభయారణ్యంలో మోదీ కలియ తిరిగారు. సఫారీ దుస్తులు, టోపీ ధరించిన ప్రధాని.. అటవీ శాఖ వాహనంలో టైగర్ రిజర్వ్​ను సందర్శించారు. భారత దేశ ప్రకృతి సౌందర్యాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించానని ట్వీట్ చేస్తూ ఫొటోలను మోదీ షేర్ చేశారు. టైగర్​ రిజర్వులో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు.

ఈ టైగర్​ రిజర్వ్​ లోని కొంతభాగం చామరాజనగర్​ జిల్లా.. మరికొంత భాగం మైసూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. 1973లో పులుల్ని వాటి ఆవాసాల్ని రక్షించేందుకు రిజర్వ్​ ఫారెస్ట్​ పరిసరాలను విస్తరించి 880 చదరపు కిలోమీటర్లతో ప్రాజెక్ట్​ టైగర్​ను ప్రారంభించారు. ప్రస్తుతం బండీపుర టైగర్ రిజర్వ్ విస్తీర్ణం 912 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. కర్ణాటక రాష్ట్ర పర్యటక శాఖ ప్రకారం.. పులి, దాని ఆవాసాలను రక్షించడానికి దేశవ్యాప్తంగా 30 రిజర్వ్లను గుర్తించగా.. అందులో ఈ బండీపుర టైగర్ రిజర్వ్ ఒకటి. దీంతోపాటు అంతరించిపోతున్న ఆసియా అడవి ఏనుగులకు ఇదే చివరి ఆశ్రయం. ఈ టైగర్ రిజర్వ్​లో ఎన్నో అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతులు కనిపిస్తాయి.

ఏనుగులతో ప్రధాని మోదీ

ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని నీలగిరి జిల్లా పరిధిలోని ముదుమలైలో ఉన్న తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంపును ప్రధాని సందర్శించారు. అక్కడ ఏనుగులకు చెరుకుగడలను తినిపించిన మోదీ.. మావటీలతో ముచ్చటించారు. ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న 'ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, బెళ్లి దంపతులు, అందులో కనిపించిన ప్రతినిధులు, నిర్మాత దర్శకులతో మాట్లాడారు.

బొమ్మన్, బెళ్లి దంపతులతో ప్రధాని మోదీ
ఏనుగులతో ప్రధాని మోదీ
బొమ్మన్, బెళ్లి దంపతులతో ప్రధాని మోదీ

ఇవీ చదవండి :కొత్త లుక్​లో మోదీ.. సఫారీ, టోపీ ధరించి టైగర్​ రిజర్వ్​కు..

టికెట్ కౌంటర్ మహారాష్ట్రలో.. స్టేషన్​ మాస్టర్​ గుజరాత్​లో.. ఈ రైల్వే స్టేషన్​ ఎంతో స్పెషల్ గురూ!

Last Updated : Apr 9, 2023, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details