తూర్పు లద్దాఖ్‌లో ఏడాదిన్నరగా కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు మరింత సవాల్ విసిరే దిశగా భారత్ కీలక విజయం సాధించింది. 5వేల కిలోమీటర్ల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం రాత్రి ఏడు గంటల 50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని జరిపింది. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు.
చైనా వద్ద ఉన్న 12వేల నుంచి 15వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే డాంగ్‌ఫెంగ్-41 క్షిపణికి పోటీగా అణ్వాయుధ సామర్ధ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా భారత్ అగ్ని-5ను అభివృద్ధి చేసింది. 17 మీటర్ల పొడవుండే అగ్ని-5 క్షిపణి 1.5 టన్నుల వార్‌హెడ్‌లను మోసుకువెళ్లగలదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ డీఆర్డీఓ దీనిని అభివృద్ధి చేసింది. ఘన ఇంధనంతో మూడు దశల్లో పని చేసే ఇంజన్ సాయంతో ఇది ముందుకు సాగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్ తన ఆయుధాలను మొదటగా ఉపయోగించదు అనే విధానానికి అనుగుణంగానే అగ్ని-5 ప్రయోగం జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.