వ్యాపార లావాదేవీల్లో అవినీతిని కట్టడి చేయడంలో మన దేశం పనితీరు గత ఏడాది కన్నా తీసికట్టుగా ఉందని అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. 'ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్' వివరాల ప్రకారం.. వ్యాపార అవసరాల కోసం లంచాలు సమర్పించుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్న దేశాల్లో 2021లో మన దేశం 82వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 77వ ర్యాంకులో ఉన్న భారత్ మరో అయిదు స్థానాలు దిగువకు వెళ్లడం శోచనీయమని ఆ నివేదిక పేర్కొంది.
మొత్తం 194 దేశాల్లోని పరిస్థితిని పరిశీలించి ఈ జాబితా రూపొందించినట్లు 'ట్రేస్' సంస్థ తెలిపింది. పొరుగు దేశమైన భూటాన్ 62వ ర్యాంకుతో మన దేశం కన్నా మెరుగైన స్థితిలో ఉంది. పాకిస్థాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌లలో పరిస్థితి భారత్ కన్నా అధ్వానంగా ఉందని నివేదిక పేర్కొంది. 2020లో మన దేశానికి లభించిన స్కోరు 45 కాగా ఈ ఏడాది ఒక మార్కు కోల్పోయి 44కే పరిమితమయ్యింది. పెరూ, ఉత్తర మాసిడోనియా, మాంటెనీగ్రో దేశాలు కూడా 44 స్కోరుతో మన దేశంతో సమానంగా నిలిచాయి.