India Smart Cities Conclave 2023 :మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ భారత్‌లో ఉత్తమ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానం.. ఆగ్రా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్ 2023లో భాగంగా బుధవారం ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మధ్యప్రదేశ్ తొలి స్థానాన్ని సంపాదించుకుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా.. ఈ అవార్డును అందుకున్నారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
Best Smart City In India : ఇందౌర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము.. ఓ అంచనా ప్రకారం 2047 నాటికి దేశంలో 50 శాతానికిపైగా జనాభా కేవలం పట్టణాల్లోనే నివసిస్తారన్నారు. ఆ సమయానికి దేశ జీడీపీలో 80 శాతానికి పైగా నగరాల నుంచే వస్తుందని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరాల అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఆమె సూచించారు. వాతావరణ మార్పులు సహా పునరుత్పాదక ఇంధనంపైనా దృష్టి సారించాలని చెప్పారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నగరాల్లో డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలను నివారించడానికి ప్రజల సహాకారం తప్పనిసరి అని ఆమె గుర్తు చేశారు.