కరోనాపై పోరులో విదేశాలకు టీకాలను అందిస్తూ అండగా నిలుస్తోంది భారత్. టీకా సాయంలో భాగంగా బహ్రెయిన్, శ్రీలంక దేశాలకు గురువారం టీకాలను పంపించింది. కొవిషీల్డ్ టీకాను తయారీ చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ముంబయి విమానాశ్రయం నుంచి ఈ టీకాలను పంపింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్లు శ్రీలంక చేరుకున్నాయని వెల్లడించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. 2-8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య టీకాలను ప్యాకింగ్ చేసి పంపారు.
భారత్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు 5 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. భారత్ నుంచి టీకాలు అందిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు శ్రీలంక, బహ్రెయిన్ దేశాలు కసరత్తు చేస్తున్నాయి.
సరిహద్దు మిత్ర దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లకు భారత్ ఇప్పటికే ఉచితంగా టీకాలు అందించింది.