మయన్మార్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో శాంతి, సుస్థిరతల నిర్వహణలో భారత్‌కు ప్రత్యక్ష బాధ్యత ఉందని పేర్కొంది. ఈ మేరకు లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్.. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. సమస్యలను శాంతియుతంగా చర్చించుకోవాలని కోరారు. మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. భద్రతా మండలి సహా వివిధ వివిధ దేశాలతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు స్పష్టం చేశారు.
"భూతలంతో పాటు సముద్రంలో మయన్మార్‌తో భారత్ సరిహద్దును పంచుకుంటోంది. ఆ దేశంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రత్యక్ష బాధ్యత కలిగి ఉంది. 'పొరుగుదేశాలే ప్రథమం', 'యాక్ట్ ఈస్ట్' వంటి భారతదేశ విదేశాంగ విధానాలతో మయన్మార్ సామాజిక ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించాం. ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్పేందుకు సహకరించాం. ఇటీవల జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి."
-వీ మురళీధరన్, విదేశాంగ సహాయ మంత్రి
రాజకీయ నేత మృతి
కాగా, మయన్మార్‌లో సైన్యం నిర్బంధంలో ఉన్న అంగ్ సాన్ సూకీ పార్టీ నేత జా మ్యాట్ లైన్ ప్రాణాలు కోల్పోయారు. కస్టడీలో తీవ్రంగా హింసించడమే మరణానికి కారణమని తెలుస్తోంది. నిర్బంధానికి గురయ్యే ముందు ఫేస్బుక్లో లైవ్‌లో నిరసనకారులను ఉద్దేశించి మ్యాట్.. మాట్లాడారని సీఎన్ఎన్ పేర్కొంది. సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా అనుక్షణం పోరాడాలని పిలుపునిచ్చారని తెలిపింది.
ఇదివరకే ఓ రాజకీయ నేత నిర్బంధంలో మరణించిన నేపథ్యంలో తాజా ఉదంతంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సైన్యం అధీనంలో ఉన్న నేతల పరిస్థితిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యాంగోన్ ఎన్ఎల్డీ పార్టీ ఛైర్మన్ ఖిన్ మవూంగ్ లాట్ గత శనివారం కస్టడీలో మృతి చెందారు.
టౌన్‌షిప్‌పై దాడి
మరోవైపు, మయన్మార్ భద్రతా దళాలు యాంగోన్‌లోని మింగలార్ టాంగ్ న్యూన్త్ టౌన్‌షిప్‌పై దాడికి దిగాయి. ఇక్కడ నివాసం ఉంటున్న రైల్వే కార్మికులు దేశంలో మిలటరీ పాలనకు వ్యతిరేకంగా సమ్మెలో ఉన్నారు. స్థానిక రైల్వేస్టేషన్‌ను, టౌన్‌షిప్‌ను పోలీసులు మూయించారు. అధికారులు కొందరు గృహస్థులను బలవంతంగా అక్కడి నుంచి తరలించినట్టు స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. బుధవారం యాంగోన్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతోపాటు బాష్పవాయు ప్రయోగం వంటి చర్యలకు పాల్పడారు. కొన్నిచోట్ల రబ్బరు బుల్లెట్లు ఉపయోగించగా.. ఎవరూ గాయపడినట్టు నిర్ధరణ కాలేదు.
ఉత్తర ఒక్కలాపా ప్రాంతంలో దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల కిందట అరెస్టు చేసిన సుమారు 400 మంది యువత ఇప్పటికే జైళ్లలోనే మగ్గుతోంది. ఈ అరెస్టులకు కొద్దిరోజుల ముందు మయన్మార్ రైల్వే వర్కర్స్ యూనియన్‌తోపాటు మరికొన్ని యూనియన్లు సమాఖ్యగా ఏర్పడి దేశవ్యాప్తంగా పనుల నిలిపివేతకు పిలుపునిచ్చాయి. దాదాపు అయిదుగురు మరణించిన దవే పట్టణం ఆందోళనలకు కేంద్రంగా మారింది. దేశంలో రెండో పెద్ద నగరమైన మాండలేలో బౌద్ధ సన్యాసులు ఆందోళనలకు మద్దతు పలికారు.
ఇదీ చదవండి:నిరసనకారుల నయా ట్రెండ్- రక్షణ కవచాలతో ఉద్యమం