దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో 'డెల్టా ప్లస్' వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రకం వైరస్ ఇప్పటికే పలు రాష్ట్రాలకు పాకగా.. 40కి పైగా కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 21 'డెల్టా ప్లస్' కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో ఆరు, కేరళలో మూడు, తమిళనాడులో మూడు కేసులు బయటపడ్డాయి. ఇక పంజాబ్, జమ్ముకశ్మీర్ తదితర రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
మరోవైపు 'డెల్టా ప్లస్' రకాన్ని ఆందోళనకర రకం (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)గా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీనిలో సంక్రమణశక్తి పెరగడం, ఊపరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పరచడం, మోనాక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్షియం ఆన్ జీనోమిక్స్(ఇన్సాకాగ్) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 10 దేశాల్లో డెల్లా ప్లస్ రకం కేసులు వెలుగుచూశాయి. భారత్‌లో ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వయిజరీలు జారీ చేసింది. ఈ వేరియంట్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది.