జమ్ముకశ్మీర్‌పై ఇటీవల పాకిస్థాన్, చైనాలు సంయుక్త ప్రకటన చేయటాన్ని తీవ్రంగా ఖండించింది భారత్. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లు తమ అంతర్గత భాగమని స్పష్టం చేసింది. అలాగే.. చైనా-పాకిస్థాన్‌కు చెందినట్లు చెప్పుకొంటోన్న ఆర్థిక కారిడార్‌పైనా ప్రకటన చేయటాన్ని తప్పుపట్టారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ. అది భారత భూభాగంలో ఉందని, దానిని పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుందని పేర్కొన్నారు.
" జమ్ముకశ్మీర్ గురించి మాట్లాడే ప్రతి అంశాన్ని భారత్ ఇప్పటికే తిరస్కరించింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లు భారత అంతర్భాగం, మా దేశంతో విడదీయలేని భూభాగాలు. సీపెక్ భారత భూభాగంలో ఉందని పాకిస్థాన్, చైనాలకు ఇప్పటికే తెలియజేశాం. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగాల స్థితిని మార్చేందుకు ఏ దేశమైనా ప్రయత్నిస్తే భారత్ దానిని సహించదు. అలాగే.. పాకిస్థాన్ సైతం తమ అధీనంలో ఉందనే కారణంగా మార్చాలనుకున్నా ఊరుకునేది లేదు. అలాంటి చర్యలను అడ్డుకోవాలని సంబంధిత అంతర్జాతీయ విభాగాలను కోరాం."