Global Hunger Index 2022 : ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ) వార్షిక సర్వేలో భారత స్థానం మరింత దిగజారింది. తాజా నివేదికలో భారత్‌కు 107వ స్థానం దక్కింది. కన్‌సర్న్ హంగర్, వెల్త్ హంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. గతేడాది 116 దేశాల్లో నిర్వహించిన ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 101 స్థానంలో నిలిచింది. తాజా నివేదికలో మొత్తం 121 దేశాలను పరిగణలోకి తీసుకుని ఈ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక 64, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్ 99 స్థానాల్లో నిలిచాయి.
ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉందంటూ ఈ నివేదికను గతంలో కేంద్రం ఖండించింది. ప్రస్తుత సూచీపై కాంగ్రెస్ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో 22.4 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. ఆకలి సూచీలో భారత్ దాదాపు అట్టడుగు స్థానానికి చేరుకుందన్న చిదంబరం.. దీనిపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారని విమర్శించారు.