లండన్‌లోని భారత్ హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను.. ఖలిస్థాన్ అనుకూలవాదులు కిందికి దింపేసి అగౌరవపరచడంపై భారత్ మండిపడింది. దీనికి సంబంధించి దిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు.. లండన్‌లో చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. వెంటనే అక్కడి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది. కాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అనుచరులను పంజాబ్ పోలీసులు అరెస్టులు చేశారు. అమృత్‌పాల్ సింగ్ కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు, మూడు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
సోమవారం సాయంత్రం నుంచి ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం లండన్‌లో నిరసనలు ప్రారంభించింది. లండన్‌లోని భారత హై కమిషన్ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసింది. ఈ చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. నిరసనకారులు భారత హైకమిషన్ కార్యాలయానికి వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం భారత హైకమిషన్‌కు భద్రత కల్పించడం యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని భారత విదేశాంగ శాఖ గుర్తు చేసింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించటం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.