ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత్ విజయవంతమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలోని అనేక మతాలు, భాషలు భారత్‌ను ఐకమత్యంగా ఉంచడానికే కృషి చేశాయని, విభజనకు కాదని అన్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి గణతంత్ర వేడుకలను ఉద్దేశించి దేశప్రజలకు సందేశం ఇచ్చారు. పౌరులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముర్ము.. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను కొనియాడారు. పేద, నిరక్షరాస్య దేశాన్ని.. ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా మార్చడంలో వారి ఆదర్శాలు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
'ప్రజాస్వామ్య గణతంత్రంగా భారత్ విజయవంతం.. వారి ఆదర్శాల వల్లే'
భారత్‌లో ఉన్న అనేక మతాలు, భాషలు.. దేశ ఐక్యతకే కృషి చేశాయని, విభజనకు కాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆధునిక గణతంత్రంగా భారత ప్రయాణం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
"భారతదేశ ప్రయాణం చాలా దేశాలకు స్ఫూర్తిదాయకం. దేశంలోని ప్రతి పౌరుడు భారతదేశ ప్రయాణాన్ని చూసి గర్విస్తాడు. ప్రజాస్వామ్యానికి మాతృదేశంగా పేరు గడించిన భారత్.. ఆధునిక గణతంత్ర దేశంగా విజయవంతమైంది. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి నేతృత్వం వహించిన డా. బీఆర్ అంబేడ్కర్‌కు దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది. రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న ప్రతిఒక్కరినీ మనం గుర్తుంచుకోవాలి. విదేశీ పాలనలో పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలు వెంటాడినా.. భారతీయుల స్ఫూర్తి చెక్కుచెదరలేదు. సరికొత్త ఆశలతో, ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తున్నాం."
-ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ గొప్పగా పుంజుకుందని తెలిపారు. కేంద్రం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాయని అన్నారు. 'కరోనా ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థలోని చాలా రంగాలు కుదుపునకు గురయ్యాయి. సమయానుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. వాతావరణ మార్పులు వంటి అతిపెద్ద సమస్యలను పరిష్కరించే వీలున్న జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా మార్చేందుకు అవసరమయ్యే చర్యలు తీసుకోవడం దీని వల్ల సాధ్యపడుతుంది' అని ముర్ము పేర్కొన్నారు.