చైనా, పాకిస్థాన్ వంటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. సైనిక, ఆయుధ శక్తిని పటిష్ఠపర్చుకునే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. రూ.1.5 లక్షల కోట్లతో 114 యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలనుకుంటున్న భారత్ వాటిలో 96 యుద్ధ విమానాలను స్వదేశంలోనే తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో వీటిని రూపొందించనున్నారు. మిగిలిన 18 యుద్ధ విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు.
'బై గ్లోబల్- మేకిన్ ఇండియా' పథకం కింద ఈ 114 యుద్ధ విమానాలను సమకూర్చుకోనుంది భారత్. ఈ మేరకు విదేశీ సంస్థలతో భాగస్వామ్యం అయ్యేందుకు భారత కంపెనీలకు అవకాశం కల్పిస్తారు. ఇటీవల భారత వైమానిక దళం.. విదేశీ యుద్ధ విమాన తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగస్వామ్యం అవడంపై ఇందులో వారు చర్చించారు. ప్రణాళికలో భాగంగా తొలుత 18 యుద్ధ విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. తదుపరి 36 యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేస్తారు. వీటికి విదేశీ కరెన్సీ, భారత కరెన్సీలలో చెల్లింపులు ఉంటాయి. ఇక చివరి 60 యుద్ధ విమానాల బాధ్యత పూర్తిగా భారత కంపెనీలదే. చెల్లింపులు కూడా కేవలం భారత కరెన్సీలోనే ఉంటాయి.