తూర్పు లద్ధాఖ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు భారత్‌తో చైనా కలిసి పనిచేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది. సరిహద్దుల్లో శాంతిస్థాపనతో పాటు ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు చైనా తమతో కలిసి వస్తుందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆకాంక్షించారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది ఎంతగానో దోహదం చేయగలదని ఆయన పేర్కొన్నారు. భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కొనసాగించే ఉద్దేశం ఇరుదేశాలకు లేదని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.