తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విపక్షాల ఐక్యపోరాటం.. ఏకతాటిపైకి 18 పార్టీలు.. టార్గెట్ మోదీ సర్కార్! - opposition news india

ప్రజాస్వామ్యంపై దాడి చేయడం సహా పాటు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 18ప్రతిపక్ష పార్టీలు ఐక్యపోరాటం చేయనున్నాయి. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. మోదీ సర్కార్‌ బెదిరింపు రాజకీయాలను ఐక్యంగా ఎదుర్కొవాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు.

opposition parties greater unity
opposition parties greater unity

By

Published : Mar 28, 2023, 7:20 AM IST

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించనున్నట్లు తెలిపాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత విధించటాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నల్లదుస్తులు ధరించి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష ఎంపీలు... మంగళవారం సైతం నిరసన కొనసాగించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో 18 పార్టీల సభాపక్ష నేతలు పాల్గొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌, DMK, NCP, JDU, BRS, TMC, ఆమ్ ఆద్మీ, CPM, CPI, MDMK, KC, RSP, RJD, జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, IUML, VCK, ఎస్పీ, JMM నేతలు పాల్గొన్నారు.

ఖర్గే నివాసంలో విపక్షాల సమావేశం

కాంగ్రెస్‌ నుంచి సోనియా, రాహుల్‌ తదితరులు, ఎన్సీపీ నుంచి శరద్‌ పవార్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు, రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు అంశాలపై.. సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన కొన్ని ఫొటోలను ఖర్గే ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. ఒక్క వ్యక్తిని కాపాడటం కోసం ప్రధాని మోదీ 140కోట్ల మంది ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ప్రధాని పరమమిత్రున్ని కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ.. ప్రజా సమస్యలను చర్చించాల్సిన పార్లమెంటు సమావేశాలను సాగనివ్వటం లేదని విమర్శించారు. అదానీ వ్యవహారంలో ఎలాంటి తప్పులేకుంటే సంయుక్త పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ఖర్గే ప్రశ్నించారు.

సమావేశంలో ఖర్గే, సోనియా, రాహుల్

మరోవైపు, కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ మంగళ, బుధవారాల్లో దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనుంది. 35 నగరాల్లో ప్రజాస్వామ్యం, రాహుల్ అనర్హతపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇతర అంశాలతోపాటు 'మోదానీ' వాస్తవికత, నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీలకు మోదీ సర్కార్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వటం వంటి అంశాలను మీడియా సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని 18పార్టీల నేతలు నిర్ణయించినట్లు చెప్పారు.

కొన్నిరోజులుగా కాంగ్రెస్‌ చేస్తున్న ఆందోళనలకు దూరంగా ఉన్న TMC....నిన్న ఆ పార్టీ విజయ్‌ చౌక్‌లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొంది. ఖర్గే నివాసంలో జరిగిన సభాపక్ష నేతల భేటీకి కూడా హాజరైంది. కొంతకాలంగా TMC అధినేత్రి మమతా బెనర్జీ... ప్రాంతీయ పార్టీలతో కూడిన కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలుచేస్తున్న నేపథ్యంలో హస్తం పార్టీ ఆందోళనలకు మద్దతు ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను సావర్కర్‌ను కానంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రేవర్గం.. ఖర్గే నివాసంలో జరిగిన భేటీకి దూరంగా ఉంది. అంతకుముందు జరిగిన నిరసనల్లో మాత్రం పాల్గొంది.

ABOUT THE AUTHOR

...view details