జమ్ముకశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కాన్ బోజ్కిర్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఇటీవల పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఆయన కశ్మీర్ ప్రస్తావన తీసుకురావడాన్ని వ్యతిరేకించింది. అనవసర వ్యాఖ్యలతో ఆయన స్థాయిని దిగజార్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
"పాకిస్థాన్ పర్యటనలో భాగంగా భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ గురించి యూఎన్జీఏ అధ్యక్షుడు బోజ్కిర్ అనవసర ప్రస్తావన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలు తప్పుదోవపట్టించే విధంగా, పక్షపాతంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలతో తన హోదాకు బోజ్కిర్ అపకారం చేశారు. అధ్యక్షుడి వ్యవహార శైలి నిజంగా విచారకరం. ఇది ప్రపంచ వేదికపై ఆయన స్థాయిని దిగజార్చుతుంది."