India Name Change Resolution : ఇండియా పేరు మారనుందా? ఇక నుంచి 'రిపబ్లిక్ ఆఫ్ ఇండియా'కు బదులు ఇక పూర్తి స్థాయిలో 'రిపబ్లిక్ ఆఫ్ భారత్'గానే వ్యవహరించనున్నారా? అన్ని అధికారిక దస్త్రాలు, కార్యక్రమాలను 'భారత్' పేరుతోనే నిర్వహించనున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. జీ20 ఆహ్వానితులకు పంపిన లేఖల ద్వారా ఇప్పటికే ఇదే విషయమై సంకేతాలు వెలువడ్డాయి. ఇండియా బదులు భారత్ అని రాయడంపై రాజకీయ దుమారం చెలరేగుతుండగానే.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈటీవీ భారత్‌కు కీలక విషయాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 18న తేదీ నుంచి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ దిశగా తీర్మానం ప్రవేశపెట్టాలని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోందని ఈటీవీ భారత్‌కు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో 2 రోజులపాటు జీ-20దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 9వ తేదీన విదేశీ అతిథులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం విందు ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాల్లో ప్రెసిండెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఇలా చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అయితే.. అధికారిక కార్యక్రమాల్లో ఇండియా పేరు భారత్‌గా మార్చటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు.
మోదీ.. చరిత్రను వక్రీకరించడం కొనసాగించండి : జైరాం రమేశ్
ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ స్పందించారు. ఈనెల 9న జరిగే జీ20 విందుకు 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులు 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాష్ట్రపతి భవన్ ఆహ్వానం పంపిందని చెప్పారు.
"మిస్టర్ మోదీ.. చరిత్రను వక్రీకరించి, ఇండియాను భారత్ అని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మార్చడం కొనసాగించండి. మేము దానికి అడ్డుపడము. 'ఇండియా' పార్టీల లక్ష్యం ఏమిటి? అది BHARAT- Bring Harmony, Amity, Reconciliation And Trust. (సామరస్యం, స్నేహం, సయోధ్య, నమ్మకాన్ని తీసుకురాడం). జుడేగా భారత్, జీతేగా ఇండియా!"
--జైరాం రమేశ్, కాంగ్రెస్ ఎంపీ
"ఇప్పుడు రాజ్యాంగంలోని 1వ అధికరణ 'భారత్, దట్ ఈజ్ ఇండియా'. ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కూడా దాడికి గురవుతున్నాయి" అని సోషల్ మీడియా ఎక్స్‌లో జైరాం రమేశ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై స్పందించిన RJD ఎంపీ మనోజ్ ఝా.. తాము తమ కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టి కొన్ని వారాలైందని అన్నారు. అప్పటినుంచి బీజేపీ 'రిపబ్లిక్ ఆఫ్ భారత్' అని ఆహ్వానాలు పంపడం ప్రారంభించిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. 'ఇండియా అంటే భారత్' అని ఉంటుందని.. వారు (బీజేపీ) తమ నుంచి ఇండియాను, భారత్‌ను వేరుచేయలేరని అన్నారు.
'భారత్ అని ఇప్పటికీ పిలుస్తున్నాం'
ఆగమేఘాల మీద ఇండియాను భారత్‌గా పిలవడం వెనక ఆంతర్యం ఏంటని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఆంగ్లంలో ఇండియా అని, హిందీలో భారత్ అని పిలవడం ఎప్పటి నుంచో కొనసాగుతోందని పేర్కొన్నారు. "ఆంగ్లంలో భారత రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. హిందీలో భారత్ కా సంవిధాన్ అంటాం. మనమంతా భారత్ అనే పేరు ఉపయోగిస్తాం. ఇందులో కొత్తేం ఉంది. ప్రపంచానికి మనం ఇండియాగా తెలుసు. ఇప్పుడు దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని దీదీ ప్రశ్నించారు.
'రెండు పేర్లు పిలుచుకోవచ్చు'
మరోవైపు, ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనదైన శైలిలో స్పందించారు. 'రాజ్యాంగ ప్రకారం ఇండియాను భారత్ అని పిలవడానికి అభ్యంతరం లేదు. ఇవి మన దేశానికి ఉన్న రెండు అధికారిక పేర్లు. వందల ఏళ్లుగా ఇండియా పేరుతో బ్రాండ్ వ్యాల్యూ నిర్మించుకున్నాం. దీన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించదని ఆశిస్తున్నా. రెండు పేర్లు ఉపయోగించడం మనం కొనసాగించాలి' అని శశిథరూర్ ట్వీట్ చేశారు.
'కూటమి పేరు భారత్ అని పెట్టుకుంటే ఏం చేస్తారు?'
విపక్ష కూటమికి భయపడే దేశం పేరును మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. తమ కూటమి పేరును భారత్‌గా మార్చుకుంటే.. దేశం పేరును మళ్లీ మారుస్తారా అంటూ ప్రశ్నించారు. 'అధికారికంగా నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను వదంతులే వింటున్నాను. మేం మా కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాం కాబట్టే ఇది జరుగుతోంది. ఈ దేశం 140 కోట్ల మంది ప్రజలది. ఒక పార్టీది కాదు. ఇండియా కూటమి తమ పేరును భారత్‌గా మార్చుకుంటే.. ఆ పేరును కూడా మారుస్తారా? మా కూటమికి భయపడి ఇదంతా చేస్తున్నారు. ఇది దేశద్రోహం' అని కేజ్రీవాల్ మండిపడ్డారు.
బీజేపీ కౌంటర్..
కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. భారత్ అని రాయడంలో, చెప్పడంలో ఇబ్బంది ఏంటమి బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రశ్నించారు. కారణం లేకుండా అపర్థాలు సృష్టించేదుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. మన దేశం భారత్ అని.. అందులో ఎలాంటి సందేహం లేదని.. కాంగ్రెస్ ప్రతిదానికి సమస్యేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ అన్నారు. 'రిపబ్లిక్ ఆఫ్ భారత్ - మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా,గర్వంగా ఉంది' అని అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.