India Name Change In Text Books : దేశంలోని అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని భారత్‌గా మార్చాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి-NCERT ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ ఛైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులుగా పురాతన చరిత్రను ప్రవేశపెట్టాలని కూడా ఎన్‌సీఈఆర్‌టీ ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఐజాక్ తెలిపారు.
జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ప్రణాళికలను ఖరారు చేసేందుకు ఇటీవలే ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. ఈ సిఫార్సులు చేసినట్లు ఛైర్మన్ ఐజాక్ తెలిపారు. ప్యానెల్ చేసిన ప్రతిపాదనను కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. అన్ని సబ్జెక్ట్‌ల పాఠ్య పుస్తకాల్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా సూచించినట్లు వెల్లడించారు. అయితే ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్ దినేశ్ సక్లానీ ప్రకటించారు.
ఎన్‌సీఈఆర్‌టీ క్లారిటీ..
మరోవైపు, ప్యానెల్ చేసిన సిఫార్సులపై ఎన్‌సీఈఆర్‌టీ క్లారిటీ ఇచ్చింది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ప్రణాళికల ఖరారు ప్రక్రియ జరుగుతోందని చెప్పింది. ప్యానెల్ సిఫార్సులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పరోక్షంగా వెల్లడించింది. ఈ దశలో కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలపై స్పందించడం సరికాదని చెప్పింది.