India Middle East Europe Corridor : దిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రతిష్ఠాత్మకమైన భారత్- పశ్చిమాసియా-ఐరోపా కారిడార్ ప్రణాళికలను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. కనెక్టివిటీని భారత్ ఎప్పుడూ ప్రాంతీయ సరిహద్దులకు పరిమితం చేయదని ప్రధాని మోదీ తెలిపారు. పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో ఈ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు.
భారత్- పశ్చిమాసియా-ఐరోపా ఎకనామిక్ కారిడార్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభ కార్యక్రమంలో మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఈ కారిడార్ భారత్- ఐరోపా ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ, అభివృద్ధికి స్థిరమైన దిశను ఇస్తుందన్నారు మోదీ. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించాలని కోరారు.
ఇది ఒక చారిత్రక ఒప్పందం : బైడెన్
India Middle East Europe Transport Corridor : భారత్- పశ్చిమాసియా కారిడార్ కోసం తాము చారిత్రక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్లు ప్రకటించడం గర్వంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. "ఈ కారిడార్‌లో కీలక భాగంగా.. భారత్ నుంచి ఐరోపా వరకు.. మధ్యలో UAE, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయిల్‌లో నౌకలు, రైళ్లపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇది మా వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని బైడెన్ తెలిపారు.