కరోనా టీకా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ కూడా వేగంగానే సాగుతోంది. అయితే.. కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకు టీకా అందిస్తున్నా.. భారత్‌లో ఎప్పుడు ఆ వయసు వారికి వ్యాక్సిన్ ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ పీక్ తగ్గినట్లే కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పటివరకు టీకానే పొందని 18 ఏళ్ల లోపువారు వైరస్‌ను తట్టుకోగలరా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే.. దీనిపై ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎప్పుడు అందుబాటులోకి..?
క్లినికల్ ట్రయల్స్ ఉత్తమ ఫలితాలనిస్తే ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లోగా చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా.
తొలుత కొవాగ్జిన్ వస్తుందా?
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సహా పలు కంపెనీలు చాలా వేగంగా చిన్నపిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని చెప్పారు గులేరియా.
'' చిన్న పిల్లల కోసం కచ్చితంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం వారిపై భారత్ బయోటెక్ కొవాగ్జిన్ క్యాండిడేట్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్-అక్టోబర్‌లోగా ఆ ఫలితాలు వస్తే.. టీకా అందుబాటులోకి వస్తుంది. మరికొన్ని కంపెనీలు కూడా ట్రయల్స్ వేగంగా నిర్వహించడం సానుకూలాంశం.''
- రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
థర్డ్ వేవ్ చిన్నపిల్లలకే ప్రమాదమా?
కరోనా మూడో దశ చిన్నపిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గత నెలలో ఓ నివేదిక విడుదల చేసింది.
అయితే.. యూకే, సింగపూర్‌లో చిన్నపిల్లలపై కరోనా ప్రభావాన్ని బట్టి వారికి వీలైనంత త్వరలో 2-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.
ఏయే వ్యాక్సిన్లు?
భారత్‌లో చిన్నపిల్లల కోసం భారత్ బయోటెక్ నుంచే రెండు వ్యాక్సిన్లు వచ్చే అవకాశముంది. ఇంకా జైడస్ క్యాడిలా జైకోవ్-డీ, సీరం నుంచి కొవావాక్స్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
భారత్ బయోటెక్ కొవాగ్జిన్
ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న స్వదేశీ టీకా ఇది. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి భారత్‌లో ఈ టీకా ఇస్తున్నారు. 2-18 ఏళ్ల వారిపై ట్రయల్స్ జరుగుతున్నాయి.
- 6-12 ఏళ్ల మధ్య వారికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు.
- దేశవ్యాప్తంగా 525 కేంద్రాల్లో ట్రయల్స్ జరుగుతాయి.
- ఇప్పటికే ఎయిమ్స్ పట్నా, ఎయిమ్స్ దిల్లీల్లో చిన్నపిల్లలపై టీకా ప్రయోగాలు జరుపుతున్నారు.
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్/బీబీవీ154
భారత్ బయోటెక్ తీసుకొస్తున్న ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను గేమ ఛేంజర్‌గా అభివర్ణిస్తున్నారు. చిన్న పిల్లలు ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఈ టీకా నిరోధిస్తుందని చెబుతున్నారు. ఇంకా ముఖ్యంగా శ్లేష్మ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
- చిన్నపిల్లలు, గర్భిణీలకు ఈ వ్యాక్సినే శ్రేయస్కరమని చెప్పారు భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల. ఆరోగ్యవంతులైన వలంటీర్లపై ఇప్పటికే ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.
- ఈ వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా అందిస్తారు.
జైడస్ క్యాడిలా జైకోవ్-డీ..
భారత్‌లో చిన్నపిల్లల కోసం మొదట ఈ వ్యాక్సినే అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే 12-18 ఏళ్ల వయసు వారిపై ప్రయోగాలు తుది దశకు వచ్చాయి.
- ఇప్పుడు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ఎదురుచూస్తోంది.
- అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను అభివృద్ధి చేసింది.
- డీఎన్ఏ ప్లాస్మిడ్ సాంకేతికతతో రూపొందించారు.
- ఈ రెండో స్వదేశీ టీకాను 56 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇవ్వనున్నారు.
సీరం 'కొవావాక్స్'..
అమెరికా కంపెనీ నొవావాక్స్ రూపొందించిన వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను.. భారత్‌లో కొవావాక్స్ పేరుతో తీసుకురానుంది సీరం ఇన్స్టిట్యూట్. ఇక్కడే టీకా ఉత్పత్తి జరగనుంది.
- ఈ జులైలో భారత్‌లో చిన్నపిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్నట్లు తెలుస్తోంది.
- ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్.. కొవిషీల్డ్ టీకాను తీసుకొచ్చింది. భారత్‌లో తొలుత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ ఇదే.
ఇవీ చదవండి: 'ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్ టీకాపై క్లినికల్ పరీక్షలు'
కొవిడ్‌ను రెండు రోజులు అడ్డుకునే నాసల్ స్ప్రే
nasal spray: 99% వైరల్ లోడును తగ్గించే నాసల్ స్ప్రే