తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పనిపట్టాలంటే.. కనిపెట్టాల్సిందే! - what is genome sezuencing

చైనాలోని వుహాన్‌లో మొదటిసారి కరోనాను గుర్తించిన తరువాత పదులకొద్దీ కొత్త రకాల్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గుర్తిస్తూనే ఉన్నారు. వీటి తీరుతెన్నులను తెలుసుకునేందుకు సంపూర్ణ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రక్రియను అనుసరిస్తారు. దీనివల్ల ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించడం, సూపర్‌ స్ప్రెడర్ల ఉనికి తెలుసుకోవడం తేలిక అవుతుంది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ఈ పరిశోధనల్లో ముందు వరసలో నిలిచి వైరస్‌ను సమర్థంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే, మనదేశం ఇంకా బుడిబుడి అడుగులే వేస్తోంది.

genome sequencing
కరోనా జీనోమ్ సీక్వెన్సింగ్​లో భారత్​ స్థానం

By

Published : Jun 3, 2021, 6:59 AM IST

కరోనాపై ఉదాసీనత ఫలితంగా రెండో ఉద్ధృతిలో దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. వైరస్‌ కొత్త రకాల రాకతో మూడోదశ ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. క్షణక్షణం రూపు మార్చుకొనే వైరస్‌ను నిలువరించాలంటే, దాని ఉత్పరివర్తనాలపై పూర్తిస్థాయి అవగాహన, పట్టు ఉండాలి. వైరస్‌ మన శరీరంలో చేరి తనను తాను విభజించుకుంటూ కొత్త కణాలకు పుట్టుకనిచ్చే క్రమంలో కొన్ని మార్పులు చేసుకుంటుంది. అవే కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి కొన్నిసార్లు అసలు వైరస్‌ కంటే బలహీనంగా ఉండవచ్చు, లేదా ప్రాణాంతకంగానూ మారవచ్చు. కొవిడ్‌కు కారణమైన సార్స్‌ కొవి-2 వైరస్‌ ఇప్పటికే ఎన్నో రకాలుగా రూపుమార్చుకుంది. చైనాలోని వుహాన్‌లో మొదటిసారి గుర్తించిన తరవాత పదులకొద్దీ కొత్త రకాల్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గుర్తిస్తూనే ఉన్నారు. వీటి తీరుతెన్నులను తెలుసుకునేందుకు సంపూర్ణ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రక్రియను అనుసరిస్తారు. దీనివల్ల ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించడం, సూపర్‌ స్ప్రెడర్ల ఉనికి తెలుసుకోవడం తేలిక అవుతుంది. మరణాల రేటును తగ్గించడంతోపాటు, వైరస్‌ బలాన్ని బట్టి వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం వీలవుతుంది. అమెరికా, బ్రిటన్‌వంటి దేశాలు ఈ పరిశోధనల్లో ముందు వరసలో నిలిచి వైరస్‌ను సమర్థంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే, మనదేశం ఇంకా బుడిబుడి అడుగులే వేస్తోంది. ఈ అలసత్వమే స్థానికంగా వృద్ధి చెందుతున్న ప్రమాదకర ఉత్పరివర్తనాలకు బలాన్ని చేకూర్చింది.

మనమింకా వెనకే...

గత ఏడాది మార్చిలో తొలి కొవిడ్‌ కేసు నమోదయిన పది నెలల తరవాతే మన ప్రభుత్వం ఈ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరిశోధనలపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 20న ఇన్సాకాగ్‌ (ఇండియన్‌ సార్స్‌ కొవి2 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్షియా)ను ఏర్పాటు చేసింది. బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో... ఐసీఎంఆర్‌, సీఎస్‌ఐఆర్‌ సహా దేశవ్యాప్తంగా ఉన్న పది జాతీయ ప్రయోగశాలలు ఇందులో పని చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారి నుంచి వందశాతం, ప్రతి రాష్ట్రం నుంచీ అయిదు శాతం నమూనాలను సేకరించి కొత్త ఉత్పరివర్తనాల ఆనుపానులు, డేటాను సేకరించడం ఇన్సాకాగ్‌ లక్ష్యం. కనీసం రోజుకు ఆరువేల నమూనాలను సేకరించి, విశ్లేషించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇన్సాకాగ్‌ పూర్తిగా వెనకబడింది. రోజుకు వెయ్యి నమూనాల లక్ష్యాన్ని కూడా ఇప్పటికీ చేరుకోలేదు. అంటే నిర్దేశించుకున్న లక్ష్యంలో ఒక్క శాతం కూడా సాధించలేదని తెలుస్తోంది. మరోపక్క మనం ఇన్సాకాగ్‌ను ప్రారంభించిన అదే డిసెంబరులో బ్రిటన్‌ కొవిడ్‌ జన్యుపటాన్ని ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిశోధనల్లో బ్రిటన్‌ ప్రపంచ దేశాలన్నింటిలోనూ ముందు వరసలో ఉంటే- అమెరికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలూ ఆ వెనకే ఉన్నాయి. రోజూ వేలకొద్దీ నమూనాలను పరిశీలించేందుకు వీలుగా కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక సూపర్‌ కంప్యూటర్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకున్నాయి. బ్రిటన్‌ కొవిడ్‌కు సంబంధించిన 65శాతం డేటాను ఆగమేఘాలపై సేకరించింది. జన్యు సీక్వెన్స్‌లపై పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ జీఐఎస్‌ఏఐడీ (గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లుయెంజా డేటా) ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అయిదున్నర లక్షల నమూనాల డేటాను సేకరించి విశ్లేషించింది. ఇందులో అధిక భాగం డేటా బ్రిటన్‌ అందించిందే. చైనా సైన్యం ఆధ్వర్యంలో పనిచేసే బీజీఐ గ్రూప్‌ అనే జీనోమిక్స్‌ సంస్థ కొవిడ్‌ కిట్లతో పాటు ఆధునిక జన్యు స్వీక్వెన్సింగ్‌ కిట్లను కూడా వివిధ దేశాలకు సరఫరా చేసింది. అయితే ఆ కిట్లను ఉపయోగించవద్దని, ప్రజల జన్యు సమాచారాన్ని చైనా సైన్యానికి చేరవేసేందుకే ఇలాంటి పని చేస్తున్నట్లు అమెరికా గూఢచార వర్గాలు చెబుతున్నాయి.

అడుగడుగునా సవాళ్లే

మన పరిశోధనలు నత్తనడకన సాగుతున్న విషయంలో పూర్తిగా శాస్త్రవేత్తలదే తప్పని చెప్పలేం. ప్రభుత్వం నుంచి ప్రయోగశాలలకు తగినన్ని నిధులు అందకపోవడమే ప్రధాన కారణం. కన్సార్షియాన్ని ప్రారంభించినప్పుడు రూ.115 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఆ నిధుల విడుదలకు తీవ్ర జాప్యాన్ని ప్రదర్శించింది. మొదటి విడత కొవిడ్‌ తరవాత కేసులు మందగించడాన్ని సాకుగా చూపిన ప్రభుత్వం గత ఏడాదిలో ఇవ్వాల్సిన నిధులను మార్చి నెలాఖరుకు రూ.83 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దాంతో గత్యంతరం లేక ఇతర ప్రాజెక్టుల నిధులను శాస్త్రవేత్తలు ఇటుగా మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కొవిడ్‌కు సంబంధించిన డేటా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడం కూడా పెద్ద సమస్యే. డేటాను గోప్యంగా ఉంచడంపై శాస్త్రవేత్తల్లో మొదట్నుంచీ అసంతృప్తి ఉంది. టీకాలు, పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, పరీక్షల ఫలితాలు, కొవిడ్‌ మరణాలపై పూర్తి, వాస్తవ సమాచారాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తే తప్ప తమ పరిశోధనలు ముందుకు సాగవని, డేటాను అందుబాటులో ఉంచాల్సిందిగా ప్రొఫెసర్‌ పార్థమజుందార్‌, ప్రొఫెసర్‌ శ్రీధరన్‌ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో 350 మంది శాస్త్రవేత్తలు ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు. కనీసం దానిపై దృష్టి సారించి ఉన్నా, మరణాల రేటును తగ్గించుకుని ఉండేవాళ్లమనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. దీనికి తోడు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు అవసరమైన ముడిసరకుల దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది కూడా పరిశోధనలను వెనకంజ వేసేలా చేసింది. పోటెత్తుతున్న రోగులకు సేవలు అందించడంలో నిమగ్నమై అలసిపోతున్న వైద్య సిబ్బందికి పరీక్షలు అదనపు భారంగా మారాయి. తగినంత మంది వైద్య సిబ్బంది లేకపోవడం కూడా పరిశోధనల్లో వేగం తగ్గడానికి కారణమైంది. ఇదంతా ఇక్కడితో ముగిసిపోయేది కాదు. వైరస్‌ రూపుమార్చుకుని మరో వేరియంట్‌గా అవతరించడం అనేది నిరంతర ప్రక్రియ. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ముందడుగు వేస్తే మంచిది.

శాస్త్రవేత్తల హెచ్చరిక

ఇన్ని సవాళ్లు, అసంతృప్తుల మధ్య కూడా కన్సార్షియం తన లక్ష్య సాధనలో ముందుకెళ్లేందుకు కృషి చేయడం విశేషం. ఈ ఏడాది మొదట్లోనే బి.1.617 ఉత్పరివర్తనాన్ని కన్సార్షియం శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో భారత్‌కు పెనుముప్పు ఉందంటూ మార్చి మొదట్లోనే ప్రధానమంత్రికి తెలిపారు. ప్రజలు భారీగా పాల్గొనే సభలు, ర్యాలీల కారణంగా భారత్‌ భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని షాహిద్‌ జమాల్‌ వంటి ప్రధాన శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాటిని ప్రభుత్వం బుట్టదాఖలు చేయడంతో, జమాల్‌ కన్సార్షియం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు- రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని రెండో ఉద్ధృతిలోని పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి.

- శ్రీసత్యవాణి గొర్లె

ఇదీ చదవండి:Pfizer: 'కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం'

Supreme Court: 'టీకా బడ్జెట్​లో ఎంత ఖర్చు చేశారు?'

ABOUT THE AUTHOR

...view details