ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం కలిసి పయనించగలవని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ ఎంచుకున్న మార్గం అదేనని తెలిపారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పెట్రోలియం, రవాణా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో ఆయన వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇథనాల్ రంగ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ విడుదల చేయడం ద్వారా భారత్ కీలక ముందడుగు వేసిందని మోదీ అన్నారు.
" 2030 నాటికి పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని ఐదేళ్లు ముందుకు జరిపి.. 2025కే కుదించాం. దీంతో కాలుష్య కట్టడి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనున్నాం. చెరకు సహా చెడిన ఆహార ధాన్యాల నుంచి తీసే ఇథనాల్.. పర్యావరణహితమే కాక రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా పనిచేస్తుంది. ఇథనాల్ ఉత్పత్తి, పంపిణీ కోసం ఇ-100 పైలట్ ప్రాజెక్టు నేడు పుణెలో ప్రారంభమైంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి