భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చి, బానిసత్వం జాడలను సమూలంగా తొలగించేందుకు దేశప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ వచ్చే 25ఏళ్లలో భారత్‌ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు పనిచేయాలని సూచించారు. ఇందుకోసం ప్రధాని.. ఐదు తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రజలంతా వీటిపైనే తమ శక్తినంతా కేంద్రీకరించాలని పిలువునిచ్చారు.
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మోదీ పంచసూత్రాలు - మోదీ పంచ సూత్రాలు
స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకోసం దేశప్రజలకు ఐదు సూత్రాలు బోధించారు. వీటిపైనే వచ్చే 25 ఏళ్ల పాటు పనిచేయాలని పిలుపునిచ్చారు.
"స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి.. మన దేశం కోసం పోరాడిన వారి కలలను సాకారం చేసి చూపించాలి. వచ్చే 25ఏళ్ల పాటు యువత దేశ అభివృద్ధి కోసం తమ జీవితాలను అంకితం చేయాలి. దేశమే కాకుండా మొత్తం మానవజాతి అభివృద్ధికి పాటుపడాలి. అదే భారతదేశానికి ఉన్న బలం. పెద్ద సంకల్పాలతో ముందుకు కదలాలి. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి 'భారత్ అభివృద్ధి చెందిన దేశ'మనే కల సాకారం కావాలి. ఇందుకోసం వచ్చే 25 ఏళ్ల పాటు ఐదు సూత్రాలపై దృష్టిసారించాలి. 1.అభివృద్ధి చెందిన భారతం, 2.బానిసత్వం నిర్మూలన, 3.ఘనమైన వారసత్వం, 4.ఏకత్వం, 5.పౌరబాధ్యత ఇవే మన పంచప్రాణాలు. పంచప్రాణాల మార్గదర్శనంలో వచ్చే 25 ఏళ్లు సమష్టిగా పనిచేద్దాం. 130 కోట్ల మంది సంకల్పంతో ఇది సాధ్యమవుతుంది. 130 కోట్ల మంది ఒక అడుగు ముందుకు వేస్తే.. దేశం 130 కోట్ల అడుగులు ముందుకు వేస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి