తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సరిహద్దులో 26 గస్తీ పాయింట్లను కోల్పోయాం'.. కేంద్రానికి సంచలన నివేదిక - గస్తీ పాయింట్లు ఇండియా చైనా

భారత్‌- చైనా మధ్య సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆందోళనకర విషయం బహిర్గతమైంది. లద్దాఖ్‌లో కారాకోరం పాస్ నుంచి చుమూర్ వరకు 65 పెట్రోలింగ్‌ పాయింట్లు ఉండగా.... భారత్‌ 26 పాయింట్లలో పెట్రోలింగ్‌ చేయడం లేదని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదే అదునుగా చేసుకొని చైనా ఆ భూభాగాలను తనలో కలిపేసుకుంటోందని పేర్కొన్నారు.

India Patrolling Points eastern Ladakh
India Patrolling Points eastern Ladakh

By

Published : Jan 25, 2023, 5:19 PM IST

తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26 గస్తీ పాయింట్లను భారత్‌ కోల్పోయిందని అక్కడి సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి గత వారం నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. "ప్రస్తుతం అక్కడ (తూర్పు లద్దాఖ్‌) కారాకోరం పాస్‌ నుంచి చుమూర్‌ వరకు మొత్తం 65 పెట్రోలింగ్‌ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత్‌ సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. కానీ, మొత్తం 65 పెట్రోలింగ్‌ పాయింట్లలో 26 చోట్ల (5-17, 24-32, 37)కు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయి" అని లేహ్‌ ఎస్పీ పి.డి. నిత్య కేంద్రానికి అందించిన నివేదికలో వెల్లడించారు. ఈ నివేదికను ఆమె గత వారం దిల్లీలో జరిగిన పోలీస్‌ల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌ కూడా పాల్గొన్నారు.

చైనా కన్ను
ఈ ప్రాంతాల్లో భారత్‌ గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని చైనా సాకుగా చూపి.. ఆ భూభాగాలను కలిపేసుకుంటోందని ఆ నివేదికలో హెచ్చరించారు. అటువంటి ప్రాంతాల్లో బఫర్‌జోన్లను సృష్టించి సరిహద్దును వెనక్కి నెడుతోందని దీనిలో పేర్కొన్నారు. చైనా అంగుళం తర్వాత అంగుళం భూమిని ఆక్రమించుకొనే ఈ వ్యూహాన్ని సలామీ స్లైసింగ్‌ అంటారని నివేదిక వెల్లడించింది. "ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చేపట్టిన చర్చల్లో ఏర్పాటు చేసే బఫర్‌ జోన్లను అవకాశంగా మలుచుకొంటోంది. ఇక్కడ ఎత్తైన శిఖరాలపై కెమెరాలను అమర్చి.. భారత్‌ దళాల కదలికలను పసిగడుతోంది. బఫర్‌ జోన్‌లోకి మన సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే అభ్యంతరం చెబుతోంది. ఆ ప్రదేశం తమ భూభాగంగా వాదిస్తోంది. ఆ తర్వాత మరింత బఫర్‌ జోన్‌ ఏర్పాటు పేరిట భారత్‌ను వెనక్కి నెడుతోంది" అని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విశ్లేషించారు.

చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్‌ ఆరోపించిన నెలరోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం విశేషం. డిసెంబర్‌ 9న భారత్‌-చైనా దళాలు అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీపంలో ఘర్షణపడ్డాయి. గల్వాన్‌ ఘటన తర్వాత జరిగిన పెద్ద ఘర్షణ ఇదే.

ABOUT THE AUTHOR

...view details