దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా మహమ్మారిపై నిర్వహించిన ఉన్నత స్థాయి మంత్రుల 23వ సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 146 జిల్లాల పరిధిలో గత ఏడు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కరోనా గ్రాఫ్ తగ్గుముఖానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు.. 'సమాజ హితం కోసమే ప్రభుత్వం' అనే నినాదాన్ని అనుసరించి దేశంలో కరోనాను విజయవంతంగా అరికట్టగలిగామని తెలిపారు.
19.5కోట్ల పరీక్షలు..
దేశంలో ప్రస్తుతం రోజుకు 12లక్షల కరోనా టెస్టులు చేయగలుగుతున్నామని.. ఇప్పటివరకూ 19.5 కోట్ల పరీక్షలు నిర్వహించామని మంత్రి వెల్లడించారు. గత 24 గంటల్లో 12,000 కన్నా తక్కువ కేసులు నమోదు కాగా.. క్రియాశీల కేసుల సంఖ్య 1.73 లక్షలుగా ఉంది. అందులో 0.46శాతం మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు మంత్రి. మరో 2.20 శాతం ఐసీయూలో, 3.02 శాతం ఆక్సిజన్ సాయంతో చికిత్స తీసుకుంటున్నారని వివరించారు.