స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో ఖాతాలు (swiss bank account) కలిగి ఉన్న మరికొందరు భారతీయులు, మరిన్ని భారతీయ కంపెనీల వివరాలు కేంద్ర ప్రభుత్వం చేతికి అందాయి. 'ఆటోమేటిక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ)' ఒప్పందంలో భాగంగా భారత్‌కు వాటిని అందజేసినట్లు స్విస్‌కు చెందిన ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మొత్తం 96 దేశాలతో 33 లక్షల ఖాతాల వివరాలను ఈ ఏడాది పంచుకున్నట్లు ఎఫ్‌టీఏ వెల్లడించింది. ఆ జాబితాలోని వ్యక్తులు, సంస్థల వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు మాత్రం నిరాకరించింది. స్విస్‌లో ఖాతాలున్న భారతీయులు, భారతీయ కంపెనీల వివరాలు మన దేశానికి అందడం ఇది మూడోసారి. 2019, 2020ల్లోనూ సంబంధిత జాబితాలను ఆ దేశం చేరవేసింది. తదుపరి జాబితా వచ్చే ఏడాది సెప్టెంబరులో అందనుంది. స్విస్ అందించే జాబితాల్లో ఆయా వ్యక్తులు/కంపెనీల పేర్లు, చిరునామా, దేశం, పన్ను గుర్తింపు సంఖ్య, బ్యాంకు ఖాతా తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి.