తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్‌ యుద్ధవిమానాలకు 'మేక్ ఇన్​ ఇండియా​' టచ్​.. పాక్​, చైనాకు చుక్కలే!

India France Rafale Deal : ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ధ విమానాలు మరింత శత్రు భీకరంగా మారనున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర ఎయిర్‌ వంటి క్షిపణులను రఫేల్‌ యుద్ధ విమానాలకు అనుసంధానించే విధంగా మార్పులు చేయాలని డసాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థకు భారత్‌ ప్రతిపాదనలు పంపింది. దీనివల్ల స్వదేశీ క్షిపణులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడమే కాకుండా భారత గగనతలం శత్రు దుర్భేద్యంగా మారుతుందని రక్షణశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

dassault rafale deal india
dassault rafale deal india

By

Published : Jul 24, 2023, 9:46 AM IST

India France Rafale Deal : పొరుగు దేశాలు పాకిస్థాన్​​, చైనా నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉన్న వేళ ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ధవిమానాలను మరింత శత్రు భీకరంగా రూపొందించాలని భారత్‌ భావిస్తోంది. దేశీయంగా తయారు చేసిన అస్త్ర ఎయిర్‌, అస్త్ర మార్క్‌ వంటి క్షిపణులను రఫేల్‌ యుద్ధ విమానాలకు అనుసంధానించేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు ఆ విమానాలను తయారు చేస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థకు భారత్‌ ప్రతిపాదనలు పంపింది. ఇది కార్యరూపం దాల్చితే మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి మంచి ఊతమిచ్చినట్లు అవుతుంది. స్వదేశీయ క్షిపణులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడమేకాకుండా భారత గగనతలం శత్రు దుర్భేద్యంగా మారుతుందని రక్షణశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Rafale Speed : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో రూపొందించిన అస్త్ర ఎయిర్‌, అస్త్ర మార్క్‌ తదితర క్షిపణులను భారత్‌ ఇప్పటికే వినియోగిస్తోంది. వాటిని రఫేల్‌ యుద్ధ విమానాలకు అనుసంధానించే వెసులుబాటు ఉంటే శత్రువులను మరింత దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డీఆర్‌డీవో తయారు చేసిన అస్త్ర ఎయిర్‌ను రక్షణ రంగంలో 2020 నుంచి వినియోగిస్తున్నారు. సుఖోయ్‌ ఎస్‌యూ-30ఎంకేఐ యుద్ధ విమానాలకు వీటిని అనుసంధానిస్తున్నారు. ఇవి 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. 160 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించేందుకు భారత్‌ అస్త్ర మార్క్‌2 పేరుతో క్షిపణులను రూపొందించింది. తర్వాతి వెర్షన్‌లో దీని పరిధిని 300కిలోమీటర్లకు పెంచనున్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో కొన్ని ప్రైవేటు సంస్థలు రూపొందించిన క్షిపణులను కూడా సమీప భవిష్యత్‌లో రఫేల్‌ యుద్ధవిమానాలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది.

Indian Navy Rafale Deal : ప్రస్తుతం భారత్‌ వద్ద ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్‌ యుద్ధవిమానాలు ఉన్నాయి. మరో 26 విమానాలను కొనుగోలు చేసే ప్రక్రియను భారత్‌ ఇప్పటికే మొదలు పెట్టింది. వీటిని భారత నౌకాదళం కోసం వినియోగించనున్నారు.రఫేల్‌ యుద్ధ విమానాలను భారత్‌తోపాటు ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, ఖతార్‌, గ్రీస్‌, క్రొయేషియా, ఇండోనేషియా తదితర దేశాలు వినియోగిస్తున్నాయి. శత్రు లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడులు చేయడంలో రఫేల్‌ విమానాలు వాటికవే సాటి. శత్రువు కంటికి కనిపించనంత దూరంలో ఉన్నా దాడి చేసే మెటర్స్‌ క్షిపణులు దీనికి ఉన్నాయి. ఈ శ్రేణిలో ప్రపంచంలో ఇవే అత్యున్నతమైనవి. ఇక సూదూర భూతల లక్ష్యాలను ఛేదించే స్కాల్ప్‌ క్షిపణులు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు 550 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. మైకా క్షిపణులను కూడా వాడవచ్చు. ఈ విమానంలో అమెరికా, ఇజ్రాయిల్‌, ఐరోపా దేశాల ఆయుధాలను కూడా చేర్చవచ్చు.

పాకిస్థాన్‌, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ రక్షణ ఉత్పత్తులను భారీగా సమకూర్చుకుంటోంది. ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడటం చాలా ఖర్చుతో కూడుకున్న పని, అంతేకాకుండా భారత రక్షణ వ్యవస్థ గురించి కొన్ని రహస్యాలు శత్రుదేశాలకు తెలిసే వీలుంటుంది. అందువల్ల స్వదేశంలోనే ఆయుధాలను తయారు చేసుకునేందుకు భారత్‌ మొగ్గు చూపుతోంది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి పెద్దపీట వేస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details