India First Track Woman Retires :19 ఏళ్ల వయసులోనే పట్టాలకు మరమత్తులు చేసేందుకు ఇండియన్ రైల్వేలో చేరింది ఆమె. కేవలం పురుషులకే సాధ్యమనుకున్న పనిని ఎంచుకుని.. భారత్‌లోనే మొట్టమొదటి రైల్వే 'ట్రాక్ ఉమెన్'గా రికార్డ్ నెలకొల్పింది. ఓ చేతిలో రెంచ్, మరో చేతిలో సుత్తి పట్టుకుని.. 41 ఏళ్ల పాటు సేవలందించింది. విధుల్లో నిమగ్నమై పెళ్లిని సైతం చేసుకోని ఆమె.. గురువారం పదవీ విరమణ చేసింది. ఆమెనె కేరళలోని కాసరగోడ్ జిల్లాకు చెందిన 'ట్రాక్ ఉమెన్' రమణి.
రమణి.. ఉద్యోగంలో చేరినప్పుడు ట్రాక్ పనులను కేవలం పురుషుల మాత్రమే చేసేవారు. తన రాకతో కష్టతరమైన పనులు కూడా మహిళలు చేయగలరని నిరూపించరామె. 41 ఏళ్ల పాటు రైల్వే సేవలందించి.. పయ్యన్నూరు సెక్షన్ నుంచి గ్యాంగ్మెట్గా పదవీ విరమణ చేశారు. తాను ఉద్యోగంలో చేరిన సమయంలో ప్యాంట్ వేసుకుని పనిచేయాల్సి ఉండేదని రమణి చెప్పుకొచ్చారు. కానీ చీర కట్టుకునేందుకు అధికారులు తనకు అనుమతి ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
"రోజూ పట్టాల పొడువునా 12 కిలోమీటర్లు నడిచేదాన్ని. ఆ సమయంలో చుట్టూ ఇళ్లు, మనుషులు ఎవ్వరూ ఉండేవారు కాదు. అక్కడి భాష కూడా నాకు వచ్చేది కాదు. మొదట్లో నేను చాలా భయపడ్డాను. కొద్ది రోజుల తరువాత ధైర్యంగా పనిచేశాను" అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు రమణి. అయితే ఈ ఉద్యోగంలో తాను చేరడాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని రమణి చెప్పుకొచ్చారు. అది చాలా కష్టమైన పనని.. ట్రాక్ ఉమెన్‌గా చేరవద్దని సలహా ఇచ్చినట్లు వివరించారు. అయితే అవేవి తాను లెక్కచేయలేదని.. ధైర్యంగా ఉద్యోగంలో చేరానని రమణి వివరించారు.