కర్ణాటక హుబ్లీకి చెందిన యువకుడు దేశీయ రక్షణ సామర్థ్యాన్ని అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పాడు. తొలి దేశీయ పిస్తోల్‌ను తయారు చేసి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నాడు. హుబ్లీకి చెందిన అంకుశ్ కొరవి.. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశీయంగా పిస్తోల్‌ను తయారు చేశాడు. స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆయుధాల వాడకం కొనసాగుతుండటాన్ని గ్రహించి.. సొంతంగా పిస్తోల్ తయారీకి ముందుకొచ్చాడు. దీనికి అటల్ పిస్తోల్గా నామకరణం చేశాడు.
అసాల్ట్ రైఫిళ్లు, పిస్తోళ్లు "భారత్‌లో తొలి దేశీయ పిస్తోల్‌ను మేం తయారు చేశాం. అదే అటల్ పిస్తోల్. భారత్.. 75ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటున్నప్పటికీ.. ఇంకా మనకు దేశీయ పిస్తోళ్లు లేవు. ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పిస్తోళ్లు అంత సురక్షితంగా లేవు. ప్రస్తుతం సేవల్లో ఉన్న సైనికులు, విశ్రాంత అధికారులు, పోలీసుల నుంచి సూచనలు తీసుకొని.. ఆయుధంపై పరిశోధన చేసి సొంతంగా డిజైన్ చేశాం."
-అంకుశ్ కొరవి, అస్త్ర డిఫెన్స్ స్టార్టప్ ఫౌండర్
అటల్ పిస్తోల్.. పూర్తిగా దేశీయంగా తయారైనదే. ఇందులో వాడిన పరికరాలన్నీ ఇక్కడే తయారు చేశారు. ఏ ఒక్క విడి భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేదు. దేశీయంగా తయారుచేసినప్పటికీ.. ఈ పిస్తోల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునేందుకు పిస్తోల్లో ఫైర్ కంట్రోల్ ఫీచర్ ఉంది. విధి నిర్వహణలో వేగంగా ఉపయోగించగలిగేలా.. ప్రత్యేకమైన ట్రిపుల్ యాక్షన్ మెకానిజం ఇందులో ఉంది. అంతేకాకుండా.. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన పోర్టబుల్ పిస్తోల్ అని అంకుశ్ చెబుతున్నాడు.
పిస్తోల్‌ను ప్రదర్శిస్తున్న అంకుశ్ దేశీయ పరిస్థితులకు అనుగుణంగా.. భారత దళాలు సులువుగా ఉపయోగించే విధంగా దీనికి రూపకల్పన చేశాడు అంకుశ్. అలాయ్ స్టీల్, పాలీమర్ ఫ్రేమ్‌ను ఉపయోగించిన కారణంగా.. ఈ పిస్తోల్ తక్కువ బరువు ఉంటుంది. ఖరీదైన విదేశీ పిస్తోళ్లకు ఇది మెరుగైన ప్రత్యామ్నాయమని చెబుతున్నాడు. పౌరుల కోసం 0.32 క్యాలీబర్ లైసెన్స్ పిస్తోల్‌ను సైతం అంకుశ్ రూపొందించాడు. దీంతో పాటు భారత సైన్యానికి అసాల్ట్ రైఫిళ్లు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాడు.
"15ఏళ్ల నుంచి భారత ఆర్మీ మెరుగైన అసాల్ట్ రైఫిళ్ల కోసం అన్వేషిస్తోంది. కానీ ఇప్పటికీ సరైన ఆధునిక రైఫిల్ లభించలేదు.ఈ సమస్యకు పరిష్కారంగా మేం సొంతంగా అసాల్ట్ రైఫిల్ డిజైన్ చేశాం. దీన్ని 2020లో లఖ్‌నవూలో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పోలో ప్రదర్శించాం. ప్రధాని కూడా దాన్ని చూశారు. ఇది పూర్తిగా దేశీయంగా తయారైంది. డిజైన్, అభివృద్ధి, తయారీ అన్నీ దేశీయంగానే చేశాం. ఇది దేశంలో ఎవరికీ సాధ్యం కాలేదు."
-అంకుశ్ కొరవి, అస్త్ర డిఫెన్స్ స్టార్టప్ ఫౌండర్
హుబ్లీలోని కేఎల్ఈ టెక్నికల్ యూనివర్సిటీలో బీఈ చేస్తున్న సమయంలోనే ఆయుధాల తయారీపై దృష్టిపెట్టాడు అంకుశ్. యూనివర్సిటీ సహకారంతో అస్త్ర డిఫెన్స్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. అప్పటికే మూడు దేశీయ డిజైన్లకు పేటెంట్ సంపాదించాడు. ప్రస్తుతం సొంతంగా ఆర్ అండ్ డీ, తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. వచ్చే నెలలో గుజరాత్లో జరగనున్న డిఫెన్స్ ఎక్స్‌పోలో ఆయుధాలు ప్రదర్శించే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ సంస్థలకు, వినియోగదారులకు తమ ఉత్పత్తుల గురించి పరిచయం చేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో మరిన్ని ఆయుధాలు తయారు చేసి.. దేశానికి అందించేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు అంకుశ్.