ప్రపంచంలో అత్యంత వేగంగా 17 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్ అవతరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మైలురాయిని అందుకోవడానికి చైనా 119రోజులు, అమెరికా 115రోజుల సమయం తీసుకున్నాయని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన 114వ రోజు(మే 9)న భారత్ ఈ మైలురాయిని చేరుకుంది.
సోమవారం ఉదయం 7 గంటల నాటికి 17,01,76,603 టీకా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. 24,70,799 సెషన్లలో వీటిని పంపిణీ చేసినట్లు తెలిపింది.
95,47,102 హెల్త్‌కేర్ వర్కర్లకు తొలి డోసు, 64,71,385 మందికి రెండు డోసులు అందించినట్లు పేర్కొంది. ఫ్రంట్‌లైన్ కార్యకర్తల్లో 1,39,72,612 మంది తొలి డోసు... 77,55,283 మంది రెండు డోసులు అందుకున్నారని వెల్లడించింది. 18-44 ఏళ్ల వయసు వారిలో 20,31,854 మంది తొలి డోసు అందుకున్నట్లు తెలిపింది. 60 ఏళ్ల పైబడినవారిలో 5,36,74,082 మందికి తొలిడోసు, 1,49,83,217 మందికి రెండు డోసులు అందించినట్లు వివరించింది.
రాష్ట్రాలకు మరిన్ని టీకాలు
మరోవైపు, మూడు రోజుల్లోపు రాష్ట్రాలకు 9 లక్షల టీకాలను పంపించనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలకు టీకాలు అందుబాటులోనే ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 18 కోట్ల(17,93,57,860) డోసులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించినట్లు తెలిపింది. వృథాతో కలిపి మొత్తం 16,89,27,797 డోసులను వినియోగించినట్లు తెలిపింది. కోటికిపైగా డోసులు ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.