ఇటీవల కాలంలో మెడికల్ డ్రోన్ల వినియగం కోసం ముమ్మర కసరత్తు జరుగుతోంది. మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు, ఔషధాల సరఫరా కోసం డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధానం రానున్న రోజుల్లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.
వీటిని వాడటం ఎంత వరకు సురక్షితమనే విషయంపై కూడా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు పలు పరిశోధనలు కూడా జరిగాయి. ఈ అంశంపై ఏషియన్ సొసైటీ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు డాక్టర్ తమోరిశ్ కోలే 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెడికల్ డ్రోన్ల వినియోగంపై చేసిన పలు పరిశోధనల వివరాలను ఆయన విశ్లేషించారు.
దేశీయంగా 2015లోనే టాయ్ డ్రోన్ ద్వారా హైదరాబాద్లోని అపోలో హెల్త్ సిటీ విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించిందని గుర్తు చేశారు కోలే.
'డ్రోన్లకు అమర్చిన టెంపరేచర్ కంట్రోల్ బాక్సుల్లో.. ఎర్ర రక్త కణాలు, ప్లేటెట్ యూనిట్లు, ప్లాస్మా యూనిట్లను 24 గంటల్లో కావాల్సిన ప్రాంతానికి సరఫరా చేసినా.. ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదు. 2017లో అముకేలి అనే సంస్థ చేసిన ఓ పరిశోధనలో ఇది స్పష్టమైంద'ని డాక్టర్ కోలే వివరించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలు కాపాపడేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా, కొవిడ్ 19 టీకాలను పంపించడమే కాకుండా.. కరోనా టెస్ట్ శాంపిళ్లను కూడా సురక్షితంగా సేకరించే వీలుందన్నారాయన. ఎక్కువ మంది చేతులు మారకుండా ఆ శాంపిల్స్ నేరుగా పరిక్షా కేంద్రానికి తరలించేందుకు వీలవుతుందని వివరించారు.