అఫ్గానిస్థాన్ భూభాగంపై తాలిబన్లు(Taliban) పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం(Indian consulate) నుంచి 50 మంది దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన విమానంలో భారత్కు తరలించింది. ఈ చర్యతో అక్కడి రాయబార కార్యాలయం తాత్కాలికంగా మూసివేసినట్లయింది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలను భారత్ గత మంగళవారం ఖండించింది. అత్యవసర సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
దక్షిణ ప్రాంతంలో కాందహార్ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు పట్టుబిగించారు. ఏ క్షణంలోనైనా మూకలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్ భద్రతా బలగాలతో భీకర పోరు జరిగే అవకాశం ఉంది. అలాగే తాలిబన్ల నీడలో ఆశ్రయం పొందుతున్న లష్కరే తోయిబా ఉగ్రమూకల ప్రాబల్యం దక్షిణ ప్రాంతంలో అధికం. తాలిబన్లతో కలిసి వీరంతా అఫ్గాన్ సేనలపై దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి:దళాల ఉపసంహరణతో పేట్రేగుతున్న తాలిబన్లు
చెరలో పౌరస్వేచ్ఛ- విముక్తి కలిగేదెన్నడు?