దేశంలో కరోనా టీకా తీసుకున్నవారికి బూస్టర్ డోసు(Booster Dose) ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించేందుకు అవసరమైన డేటా లేదని నిపుణులు తెలిపారు. స్థానికంగా లభించే శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన తర్వాత దీనిపై ఓ స్పష్టతకు రావచ్చని చెప్పారు. ప్రస్తుతం దీనిపై పరిశోధలు జరుగుతున్నాయన్నారు.
"శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా బూస్టర్ డోసుపై భారత్ నిర్ణయం తీసుకుంటుంది. బుస్టర్ డోసు అవసరమా? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే రెండు డోసుల తీసుకున్నాక ఎంత విరామం ఉండాలి? అనే విషయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. బూస్టర్ డోసు వల్ల ప్రతికూల ప్రభావం కూడా లేకుండా చూసుకొవాలి."
డా. ఎన్కే అరోడా, ఎన్టీఏజీఐ ఛైర్మన్
కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ దేశంలో కరోనా థర్డ్ వేవ్(corona third wave in india) సెప్టెంబర్- అక్టోబర్ మధ్య ఏ సమయంలోనైనా ఉద్ధృతం కావచ్చని ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకే వీలైనంత ఎక్కువమంది ప్రజలకు టీకా అందేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను(vaccination in india) మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఆధారాల్లేవ్..
టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసు(corona booster dose) అవసరమని చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని ఎయిమ్స్ డైరక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సహా ఇతర రకాల వైరస్ల నుంచి రక్షణ లభిస్తుందని, మరణాల రేటు కూడా తగ్గుతున్నట్లు పేర్కొన్నారు.