'ఆయుధాలు.. ఆహారం.. నీ దగ్గరుంటే విజయం నీ సొంతమవుతుంది,'..యుద్ధంలో మౌలిక వసతుల ప్రాధాన్యం గురించి చెప్పే సూత్రమిది. సరిహద్దుల్లో సైనికుల అవసరాలకు తగ్గట్టు ఆయుధాలు, ఆహారం సకాలంలో సరఫరా చేయాలంటే పటిష్ఠమైన మౌలిక వసతులు అత్యవసరం. ఇవి లేకపోవడమే 1962 నాటి యుద్ధంలో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం. భారతసైన్యం ఇప్పుడీ లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. చైనా సరిహద్దుల్లోని ఈస్ట్రన్ సెక్టార్‌లో రూ. 15 వేల కోట్లతో రహదారులు, వంతెనలు, సొరంగాలను శరవేగంగా సిద్ధం చేస్తోంది. భౌగోళిక పరిస్థితుల వల్ల దేశంలోని మిగతా ప్రాంతానికి దూరంగా ఉన్న చైనా సరిహద్దులకు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి.
ఎందుకంత ప్రాధాన్యం?
ఈస్ట్రన్ కమాండ్‌లోని తవాంగ్‌కు సమీపంలోనే చైనా సరిహద్దు ఉంది. భారతదేశం వైపు అన్నీ కొండలు, గుట్టలే. చైనా వైపు మాత్రం భూమి చదునుగా.. రవాణాకు సులువుగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ చైనా మౌలికవసతులను భారీగా అభివృద్ధి చేసింది. సరిహద్దుల సమీపంలో గ్రామాలే నిర్మించింది. ఇరుదేశాల సైనికులు ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందం ఉండడం వల్ల వాటిని ముందే మోహరిస్తే ఉద్రిక్తతలు పెరుగుతాయి. కానీ అకస్మాత్తుగా యుద్ధం వస్తే, భారత బలగాలను తరలించడం పెద్ద సమస్య. ఈ స్థితిలో రహదారి వసతులు పెంచడమే శరణ్యం.
ప్రత్యామ్నాయ రహదారి
దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గువాహటి మీదుగా తవాంగ్‌కు చేరుకోవాలంటే బాలిపుర-చార్‌దార్- తవాంగ్ రోడ్డు (బీసీటీఆర్) ఒక్కటే ఆధారం. 349 కిలోమీటర్ల ఈ మార్గంలో గువాహటి నుంచి తవాంగ్ వెళ్లాలంటే ఎక్కడా ఆగకుండా ప్రయాణించినా ఒకరోజు పడుతుంది. పైగా ఇది ఇరుకైన రహదారి. ఏడాదిలో సగం రోజులు వర్షాలు కురుస్తాయి. కొండ చరియలు విరిగిపడుతుంటాయి. ఈ ఒక్కరోడ్డును కట్టడి చేస్తే, చైనా మన దేశంలోని ఇతర ప్రాంతాలతో ఈ ప్రదేశానికి సంబంధాలు తెంచేయగలదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, భారత్ 2010-12 సంవత్సరాల మధ్య గువాహటి నుంచి రూపా-టాం వరకూ 149 కి.మీ. మేర మరో రోడ్డు నిర్మించింది. దీన్ని ఒరాంగ్-కలక్‌టాంగ్-షేర్‌గావ్-రూపా-టాం (ఓకేఎస్సార్టీ) రోడ్డు అంటారు. రూపా-టాం నుంచి తవాంగ్ వెళ్లాలంటే మళ్లీ బీసీటీఆరే దిక్కు. రూపా-టాం, తవాంగ్ మధ్య ఉన్న రహదారి చైనా సరిహద్దుకు అతి సమీపంలో ఉంటుంది. దీన్ని చైనా నిరోధిస్తే, తవాంగ్‌కు అన్ని రకాల సరఫరాలు ఆగిపోతాయి. దీంతో ఇదే మార్గంలో ప్రత్యామ్నాయ రహదారిని నిర్మిస్తున్నారు. పాత బీసీటీ, ఓకేఎస్సార్టీ రహదారుల అభివృద్ధి పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి.